Image used of representational purpose only | Photo- Pixabay

Navi Mumbai, September 27:  కామంతో కళ్లు మూసుకుపోతే ఎండిపోయిన కట్టె కూడా కత్రినా కైఫ్ లా కనిపిస్తుందన్నాడో మహాకవి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదేమో, కామంతో కళ్లు మూసుకుయిన వారికి వావివరసలే కాదు, ఆడ-మగ అనే తేడా కూడా ఉండదని చెప్పే సంఘటన ఇది. ఈ సమాజంలో మహిళలకే కాదు, ఒంటరిగా కనిపించే మగాళ్లకూ రక్షణ కరువే అని చెప్పే దిగ్భ్రాంతికర ఘటన ఇది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం నవీ ముంబై (Navi Mumbai) లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, నాలుగు రోజుల క్రితం సోమవారం నాడు ఒక 36 ఏళ్ల పురుషుడు ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు, మార్గమధ్యంలో ముంబై శివారు ప్రాంతమైన వాశి ప్రాంతంలో సిగరెట్ వెలిగించుకునేందుకు ఒక నిర్జన ప్రదేశంలో ఆగాడు. అదే అతడి పాలిట శాపమైంది, అతణ్ని చుట్టుముట్టిన ఒక 5 మంది మగాళ్లు రోడ్డు పక్కనే చోట్లపొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అతడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతడి 'వ్యక్తిగత' శరీర భాగాల తాకుతూ పైశాచికానందం పొందారు. ఎండిన కొబ్బరిచిప్పలను వెనకభాగంలో చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఆ పురుషుడు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ 5గురు అక్కడ్నించి పరారయ్యారు.

కొద్దిసేపటికి ఓపిక తెచ్చుకున్న బాధితుడు రోడ్డు మీదవరకు వచ్చి పడిపోయాడు. తర్వాత దారిన పోయేవారు అతణ్ని గుర్తించి దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతడికి శరీరంలో చాలా చోట్ల అత్యవసర సర్జరీలు నిర్వహించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు, కొబ్బరి చిప్పలను తొలగించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 377 (అసహజ నేరాలు) కింద మరియు 34 యాక్ట్ (సామూహికంగా నేరానికి పాల్పడటం) చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాధితుడు పోలీసులకు అందించిన వివరాల ప్రకారం ఆ 5గురు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసుంటారని తెలిపాడు. ఆ 5గురు డ్రగ్స్ ఏమైనా తీసుకుని ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని అతిత్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టంచేశారు.