Earthquake In Maharashtra: మహారాష్ట్రలో భూప్రకంపనలు, మూడు సార్లు కంపించిన భూమి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన గ్రామస్తులు, భూప్రకంపనలు వాస్తవమే అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే
4.8 magnitude earthquake hits Palghar in Maharashtra (Photo-ANI)

Mumbai, December 14: మహారాష్ట్రలో(Maharashtra) భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఫాల్ఘర్‌ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. పల్ఘర్ జిల్లా దహను తాలుకాలోని దుండల్‌వాడిలో శుక్రవారం(డిసెంబర్ 13, 2019) మధ్యాహ్నం నుంచి శనివారం(డిసెంబర్ 14, 2019) తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

దుండల్‌వాడిలో భూమి కంపించిన మాట(Earthquake In Maharashtra) వాస్తవమేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపారు. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు(India Meteorological Department) వెల్లడించారు.

శనివారం తెల్లవారుజామున 5.22 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.26 గంటలకు తొలిసారిగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు అయింది. శుక్రవారం రాత్రి 9.55 గంటలకు రెండోసారి భూమి కంపించింది. ఆ సమయంలో భూకంప తీవ్రత 3.4గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.