Mumbai, Nov 14: పండుగ వేళ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Satara Road Accident) చోటు చేసుకుంది. 50 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి ఓ మినీ బస్సు పడడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని పోలీసులు వివరించారు. ఆ బస్సు ముంబై నుంచి గోవా వెళుతోన్న సమయంలో పూణె-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.
వంతెన పై నుంచి వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకుపోయి కింద పడిపోయిందని వివరించారు. చనిపోయిన వారిని కేరళ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాల వారు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: తెల్లారితే దీపావళి..ఆనందంగా దీపావళిని జరుపుకుందామనుకున్న వారి కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. దీపావళి ముందు రోజు రాత్రి మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Madhya Pradesh Road Accident) చోటుచేసుకుంది. 40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు శివపురి అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ భూరియా వెల్లడించారు.
దోడి గ్రామానికి చెందిన కొందరు షియోపూర్ జిల్లా ఉనావాద్‌లో జరిగిన ఓ మత కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7:15 సమయంలో... వేగంగా వెళ్తున్న వ్యాను ఓ ఇరుకైన రోడ్డులో ప్రవేశించగానే ఈ ప్రమాదం జరిగినట్టు శివపురి ఎస్పీ రాజేశ్ సింగ్ చాందేల్ వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. క్షతగాత్రులను పోహ్రి, శివపురి జిల్లా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.