Coronavirus in India (Photo Credits: PTI)

Bengalore November 26: కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 66 మంది వైద్యవిద్యార్ధులకు కరోనా సోకింది. అయితే వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడం విశేషం. ధార్వాడ్‌ జిల్లాలోని ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్‌గా తేలింది. విద్యార్థులు ఇటీవలే ఒక కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరికి వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మెడికల్ కాలేజీలో కరోనా విజృంభణతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. ఇప్పటికే విద్యార్థులు అంతా వ్యాక్సిన్లు తీసుకోవడంతో వారిని క్వారెంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా సోకిన విద్యార్థులకు అవసరమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పరీక్షలు చేయించుకోని విద్యార్థులను వేరే చోట క్వారెంటైన్‌లో ఉంచామన్నారు. కాలేజీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో కరోనా విజృంభించినట్లు భావిస్తున్నారు. దీంతో అందులో పాల్గొన్న వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించేపనిలో ఉన్నారు.