Union Environment Minister Prakash K Javadekar | (Photo Credits: ANI)

New Delhi, October 09:  ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి బొనాంజా (Diwali Bonanza) ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులందరికీ దీపావళి పండుగ కానుకగా వారు కోరుకున్నట్లుగానే 05% DA (Dearness Allowance) పెంపుదల చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar) ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా గల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు 62 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఖజనా నుంచి రూ. 16,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు అందించాల్సిన డి.ఎ విషయంలో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ చేపడుతుంది. ఆ తర్వాత రెండు నెలల్లో పెంచిన డి.ఎను అమలు చేస్తారు. ఈ ఏడాది జనవరిలో డి.ఎను పెంచిన ప్రభుత్వం, ఆ తర్వాత జూలైలో మరోసారి పెంచాల్సి ఉంది. అయితే కొన్ని పాలనాపరమైన కారణాల చేత డి.ఎ పెంపుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న డి.ఎ ఈ దీపావళికి అందుకోబోతున్నారు. జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకు ఏరియర్స్ రూపంలో కలిపి, మొత్తం ఒకేసారి ఈ నవంబర్‌లో ఇవ్వనున్నారు. మోదీ నాయకత్వంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబడ్డాయి, అందులో భాగంగానే ఉద్యోగులకు ఈ శుభవార్త చెప్తున్నామని ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.

ప్రకాశ్ జవదేకర్ ట్వీట్

 

ప్రస్తుతం జీతంతో పాటు 12 శాతం డి.ఎ అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా మరో 5 శాతం డి.ఎ పెంపును కోరుకుంటున్నారు. ఇందుకు 7వ వేతన సంఘం (7th Pay Commission) కూడా అంగీకారం తెలుపుతూ గత ఆగష్టులోనే కేంద్రానికి సిఫారసు చేసింది. 7వ వేతన సంఘం సిఫారసులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న 12 శాతానికి మరో 5% జోడించి మొత్తంగా ఉద్యోగుల సాలరీలలో 17శాతం అదనంగా డి.ఎ.గా అందించనున్నారు.