
Delhi, October 28: ఢిల్లీ ప్రజల్లో భారీగా యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. ఢిల్లీలో నిర్వహించిన సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఢిల్లీవాసుల్లో 90 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది. సెప్టెంబర్ 23 నుంచి నిర్వహించిన ఆరో దశ సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో భాగంగా 280 వార్డుల్లో 28 వేల శాంపిళ్లను సేకరించారు. ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ మందికిలో సీరో పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
సీరో సర్వేలో దాదాపు 90 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లు చెప్పలేమంటున్నారు నిపుణులు. అంతేకాదు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడం వల్లనే సీరో పాజిటివ్ వచ్చిందన్న వార్తలను కూడా ధృవీకరించడం లేదు. ఇంత పెద్ద ఎత్తున యాంటీబాడీస్ ఉన్నంతమాత్రాన హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పలేమని, మరోసారి వైరస్ విజృంభించదనడానికి ఆధారాలు ఏవీ లేవంటున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం వైరస్ విజృంభణపై ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే కొత్త వేరియంట్లపై కూడా ఈ యాంటీబాడీల ప్రభావం ఉంటుందంటున్నారు.
ఢిల్లీలో ఏప్రిల్- మే మధ్య సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో కరోనా కేసులు వణికించాయి. ఆసుపత్రులు కిక్కిరిశాయి. ఆక్సిజన్ కొరతతో కొవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు అదుపులోకి వచ్చాయి. మరణాలు దాదాపు జీరోకు చేరుకున్నాయి. అంతకుముందు జనవరిలో నిర్వహించిన ఐదో విడత సీరో సర్వేలో 56.13 మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు యాంటీబాడీస్ ఉన్నవారి సంఖ్య పెరగడంతో నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు