MCL suffers rs. 2.7 crore loss caused by a goat | Representational Image | Photo- Wikimedia Commons

Bhubaneswar, October 02:  ఒక మేక చావు తమకు రూ. 2.68 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేసింది మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL- Mahanadi Coalfields Limited) సంస్థ.  వివరాల్లోకి వెళ్తే, ఒడిశా రాష్ట్రంలోని టాల్చర్ పట్టణంలో గల ఎంసీఎల్ బొగ్గు క్షేత్రంలోకి ఒక మేక దారితప్పి లోపలికి చొరబడింది.  కాగా, నిరంతరం టిప్పర్ల ద్వారా బొగ్గు రవాణా జరిగే ఆ క్షేత్రంలో ఒక టిప్పర్ ఢీకొని ఆ మేక అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో విషయం తెలుసుకున్న ఆ మేక యజమాని వందల మంది గ్రామస్థులతో కలిసి ఎంసీఎల్ బొగ్గు క్షేతంలోకి చొరబడి వారితో ఆందోళనకు దిగారు.

మేక మరణానికి పరిహారంగా రూ .60,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. తీవ్రఆగ్రహంతో ఉన్న ఆ ఆందోళన కారుల దెబ్బకి టాల్చర్ బొగ్గు క్షేత్రం (Talcher Coalfields) లో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేయడంతో దాదాపు మూడున్నర గంటల తర్వాత గానీ పనులు ప్రారంభం కాలేదు.

ఆందోళనకారులు చేపట్టిన ఈ దౌర్జన్యం కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు టాల్చర్ బొగ్గు క్షేత్రాల నుంచి రవాణా నిలిచిపోయింది. దీని ద్వారా రూ. 1.40 కోట్ల నష్టం జరిగిందని, టిప్పర్లను నిలిపివేయడంతో రైల్వే ద్వారా పంపించడం వలన రూ. 1.28 కోట్లు అదనంగా ఖర్చు అయ్యిందని, అలాగే మూడు గంటల పాటు పనులు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి మరో 46 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని, మొత్తంగా ఒక మేక మృతి ద్వారా తమ సంస్థ రూ. 2.68 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని MCL అధికారులు వివరించారు.

బొగ్గు క్షేత్రాలలోకి ఇతరులకు అనుమతి నిషేధం, లోపలికి ఎవరైనా అక్రమంగా చొరబడితే అది చట్టరీత్యా నేరం. అయితే కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే తమ పశువులను మేతకోసం అంటూ అక్రమంగా చొరబడుతూ ఇక్కడ కలప, బొగ్గు మరియు ఇతర విలువైన సంపదను దొంగలించడానికి వస్తున్నారు, ఇది ఆందోళన కలిగించే విషయం అని ఎంసీల్ కంపెనీ పోలీసులకు తెలిపింది.

చట్టవిరుద్ధంగా తమ పనికి ఆటంకం కలిగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సదరు కంపెనీ, పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బొగ్గు క్షేత్రాలలో ఇటువంటి దౌర్జన్యాలు జరిగితే ప్రభుత్వానికి భారీ నష్టం ఏర్పడుతుంది, ఇది దేశ ఆర్థికవృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా, రాబోయే కాలంలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే మన దేశం యొక్క ఆకాంక్షలకు విఘాతం కలిగిస్తుందని ఎంసిఎల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.