'Adhyatmik' Trap: సైంటిస్ట్ కావాల్సిన నిజామాబాద్ యువతి అధ్యాత్మిక వంచనలో బందీ, కన్న కూతురుని సైతం కలవలేక తల్లిదండ్రుల నిస్సహాయత, సహయం కోసం ఎదురుచూపులు
File image of Santosh Rupa | File Photo

Nizamabad, January 2: బిడ్డ బంగారు భవిష్యత్తుపై ఆ తల్లిదండ్రులు కన్న కలలు ఆవిరిపోయాయి. ఉన్నత స్థాయిలో తమ బిడ్డను చూస్తూ మురిసిపోదామనుకున్న వారి ఆశలకు కలలో కూడా ఊహించని ఉపద్రవం ఎదురైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి కూతురు అధ్యాత్మిక వంచకుల చేతిలో బందీగా మారింది.

వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ కు చెందిన సంతోషి రూప (Santoshi Rupa) 2005లో జేఎన్‌టీయూ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. అమెరికాలోని లూయిస్ విల్లే యూనివర్శిటీలో సీటు సంపాదించిన ఆమె, అదే యూనివర్శిటీ నుంచి 2011 పీహెచ్‌డీ పూర్తి చేసింది. 2012లో అమెరికాలోని లోవా యూనివర్శిటీలో జూనియర్ సైంటిస్ట్‌గా ఎంపికయి 'కానికల్ కార్బన్ సింథసిస్' మీద పరిశోధనలు కూడా పూర్తి చేసింది. ఇంతటి ఉన్నత చదువులు చదివి, ఉన్నత లక్ష్యాలు కలిగిన రూప 2015లో అకస్మాత్తుగా మాయమైంది. అప్పట్నించీ తల్లిదండ్రులతో కూడా కనెక్షన్ కట్ అయింది. యూనివర్శిటీలో సంప్రదిస్తే, ఆమె గ్రీన్ కార్డును సైతం వదులుకొని ఇండియా వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు బిడ్డ ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు.

సీన్ కట్ చేస్తే, ఆ యువతి దిల్లీలోని వీరేంద్ర దేవ్ దీక్షిత్ (Virendra Dev Dixit) అధ్వర్యంలో నడిచే 'ఆధ్యాత్మక విశ్వవిద్యాలయ ఆశ్రమం'  (Adhyatmik Vishwa Vidyalaya) లో ఉంటున్నట్లు తెలిసింది. స్వతహాగా భక్తిభావం ఎక్కువగా కలిగిన రూప, తనని తాను శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా చెప్పుకునే వీరేంద్ర దేవ్ దీక్షిత్ బోధనలకు, ఆధ్యాత్మకం ముసుగులో ఆ ఆశ్రమం నిర్వాహకుల ఇతరత్రా కార్యక్రమాలచే 'హిప్నటైజ్' కాబడింది.

సదరు ఆశ్రమంపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి, సీబీఐ కేసులు కూడా నడుస్తున్నాయి. కొన్ని నెలల కిందట సీబీఐ అధికారులు ఆ ఆశ్రమంపై దాడి చేసి 40 మంది యువతులను రెస్క్యూ చేశారు.

శ్రీకృష్ణుడి అవతారంగా చెప్పుకునే వీరేంద్ర దేవ్ దీక్షిత్ తనకు కూడా శ్రీకృష్ణుడిలా 16,000 మంది గోపికలను కలిగి ఉండాలనేది ఒక వాంఛ. అదే వాంఛతో ఎంతో మంది మైనర్ అమ్మాయిలను భక్తి ముసుగులో లోభర్చుకొని వారికి డ్రగ్స్ ఇచ్చి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, వారితో లైంగిక కోరికలు తీర్చుకోవడం చేస్తారని వార్తలు ఉన్నాయి. గతంలో జరిగిన దాడుల్లో డ్రగ్స్‌కు వాడిన సిరంజీలు లభ్యమయ్యాయి. అయితే బలమైన ఆధారాలు లేవు, అక్కడ ఉండే అమ్మాయిలు మానసికంగా వారి ఆధీనంలోనే ఉంటారు. వారు చేసేది దేవుని సేవగానే వాదిస్తారు.

ఇప్పుడు ఇదే పరిస్థితి రూప తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. తమ కూతురుని కలిసేందుకు కూడా పేరేంట్స్‌కు అనుమతి లేదు. ఒక వేళ కలిసినా ఆమె చుట్టూ కొంత మంది మనుషులుంటారు. వారి సమక్షంలోనే కొన్ని నిమిషాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఇటు రూప కూడా తనను కలవడానికి రావొద్దంటూ తల్లిదండ్రులకు తెగేసి చెప్తుంది. దీంతో ఆ కన్నపేగు ,  చేయి దాటిపోయిన కూతురును చూసి భారంగా బ్రతుకుతున్నారు. ఎవరైనా తమకు సహాయం చేయాలని కోరుతున్నారు.