New Delhi, November 17: అయోధ్య భూ వివాదం (Ayodhya Dispute) కేసులో సుప్రీంకోర్టు తీర్పు (Supreme Court Order) ను సవాలు చేసే నిర్ణయాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఆదివారం ఖరారు చేసింది. ఆదివారం లక్నోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఇటీవల ఏకగ్రీవంగా జారీ చేసిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ముస్లిం బోర్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ తీర్పుతో ముస్లిం పక్షం అన్యాయానికి గురైందని బోర్డు అభిప్రాయపడింది. కాబట్టి, సుప్రీం తీర్పును పున:సమీక్షించే హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఈ సమావేశంలో పాల్గొన్న జమియాత్-ఎ-ఉలేమా-హింద్ మౌలానా అర్షద్ మదాని (Maulana Arshad Madani) పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా అర్షద్ మదాని కొంత నిరాశతో వ్యాఖ్యానించడం గగనార్హం.
"మేము రివ్యూ పిటిషన్ వేసినా, అది 100 శాతం కొట్టివేయబడుతుందని మాకు తెలుసు, అయినప్పటికీ మేము ఆ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తాం, అది మా హక్కు" అని మదాని వ్యాఖ్యానించారు. బోర్డులోని మరికొంత మంది సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తమకు అన్యాయం జరిగింది అనే వాదనను వినిపించడం కోసమైనా ఈ రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.
అయితే మరోవైపు ఈ కేసు విషయంలో ప్రధానంగా చెప్పబడే, ఇక్బాల్ అన్సారీ వర్గం మరియు యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయరాదని నిర్ణయించాయి. అనేక దశాబ్దాలుగా ఈ అంశం హిందూ- ముస్లింల మధ్య విబేధాలను సృష్టించింది. ఇకనైనా అలాంటి "సామాజిక విభజన" ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో తాము దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాయి.
నవంబర్ 9న జారీ చేసిన తీర్పులో అయోధ్యలో గల ఆ వివాదాస్పద స్థలాన్ని రామ్ జన్మభూమి న్యాస్ సంస్థకు అప్పగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. పరిహారంగా అయోధ్య పట్టణంలోనే వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమి కేటాయించాలని ఆదేశిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది.