New Delhi, May 09: సిబ్బంది మూకుమ్మడి సెలవులతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానాల రద్దు కొనసాగతున్నది. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది (Cabin Crew) ఒకేసారి సెలవు పెట్టడంతో నిన్న 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పవని కంపెనీ సీఈఓ అలోక్ సింగ్ (CEO Aloke Singh) చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. సుమారు 200 మంది ఉద్యోగులు ఇలా సెలవు పెట్టారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారీగా విమానాలను రద్దుచేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
.@AirIndiaX MD Aloke Singh writes to employees on a day over 90 flights were cancelled due to a section of senior cabin crew members reporting ‘sick’ en masse overnight in protest pic.twitter.com/qKux6U5N12
— Poulomi Saha (@PoulomiMSaha) May 8, 2024
కాగా, విమానాల రద్దు విషయంలో నష్టనివారణ చర్యలను సంస్థ ప్రారంభించిది. ఇందులో భాగంగా ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 25 మంది సిబ్బందిని సంస్థ తొలగించింది. మరికొంతమందికి నోటీసులు జారీచేసింది. మరోవైపు మూకుమ్మడి సెలవులకు గల కారణాలు తెలుసుకోవడానికి సిబ్బందితో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది.
బుధవారం 100కు పైగా విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, కొచ్చి, కాలికట్, బెంగళూరు సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే బుధవారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 14 విమానాలు రద్దయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా గల్ఫ్‌కు గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు నడిపే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. ఈనెల 13 వరకు విమాన సర్వీసులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.