Allu Arjun Pushpa 2 Movie Review(X)

Hyd, Dec 5: ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతుండగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోండగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా పుష్ప 2 ప్రేక్షకులను అలరించిందా?, అల్లు అర్జున్ మరోసారి మేజిక్ చేశాడా చూద్దాం..

కథ:

పార్ట్ 1 కి కొనసాగింపు గానే పుష్ప రాజ్(అల్లు అర్జున్) ఎర్ర చందనం సిండికేట్ లో రారాజుగా మారతాడు. అయితే ఈ క్రమంలో తన భార్య శ్రీవల్లి(రష్మిక మందన్నా)కి ఇచ్చిన మాట కోసం ఎంతదూరం వెళ్లడానికైనా రెడీ అవుతాడు. సీన్ కట్ చేస్తే రాజకీయాలను శాసించే స్థాయికి పుష్ప ఎదుగుతాడు. అయితే మరోవైపు పుష్ప ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న భన్వర్ సింగ్ షేకావత్(ఫహాద్ ఫాజిల్) ఏం చేస్తాడు? పుష్ప కి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్(అజయ్) నుంచి తెచ్చుకోగలిగాడా?, చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేదే పుష్ప 2 కథ.

ప్లస్ పాయింట్స్:

అల్లు అర్జున్ , ఫాహద్ ఫజిల్ నటన, జాతర ఎపిసోడ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, పాటలు, సుకుమార్ దర్శకత్వం, జాతరలో రష్మికా నటన సినిమాకే హైలైట్. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రాణాలకు తెగించి నటించాడు. బన్నీ కెరీర్‌లోనే నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని సీన్స్‌లో అదరహో అనిపించాడు. ఇక జాతర ఎపిసోడ్‌లో అయితే సినిమాకే హైలైట్. నిజంగానే అమ్మవారు పూనిందా? అన్నట్టుగా భయపెట్టాడు బన్నీ. ప్రీ క్లైమాక్స్ ఫైట్‌లో ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు విజిల్స్ వేయించాడు బన్నీ. శ్రీవల్లి పాత్రకు పుష్ప 2లో స్కోప్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. అయితే బన్నీ - రష్మికా మధ్య రొమాన్స్ సీన్స్ మాత్రం అద్భుతంగా పండాయి. ఫహాద్ ఫాజిల్‌,రావు రమేష్,జగపతిబాబు మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేస్తే బాగుండేది. బలమైన విలన్‌ పాత్ర లేకపోవడం. అలాగే చాలా చోట్ల పుష్ప రాజ్ డైలాగ్‌లు అర్థం కావు. ఆ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది.

సాంకేతిక విబాగం:

సాంకేతికంగా సినిమాకు వంక పెట్టలేం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌కి పూనకాలు రావడం పక్కా. ప్రీ క్లైమాక్స్ ఫైట్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ జాతర ఎపిసోడ్‌ని మించేసింది. మిరోస్లా కూబా బ్రొజెక్‌ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ కాగా.. మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్‌తో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళా ప్రేక్షకురాలి మృతి...అపస్మారక స్థితిలోకి చిన్నారి..వీడియో ఇదిగో 

తీర్పు:

ఓవరాల్‌గా పుష్ప 2 నెక్ట్స్‌ లెవల్ అంతే. బన్నీ వన్‌మ్యాన్‌ షోగా సినిమాను నడిపించాడు. తగ్గేదేలే అంటూ నట విశ్వరూపం చూపించగా అన్ని క్రాఫ్ట్స్‌ సినిమాకు కలిసి వచ్చాయి. రన్‌టైం ఎక్కువైనా ప్రేక్షకులను అంతసేపు కుర్చిలో కూర్చోబెట్టడంలో దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్‌ నభూతో నభవిష్యత్. మొత్తంగా మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా పుష్ప 2 నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3.75/5

నటీనటులు: అల్లు అర్జున్,రష్మిక మందన్న,ఫహాద్ ఫాజిల్‌,సునీల్

సంగీతం:దేవీ శ్రీ ప్రసాద్

నిర్మాత:మైత్రీ మూవీ మేకర్స్

దర్శకుడు: సుకుమార్