Blast Near Golden Temple (PIC@ ANI twitter)

Amritsar, May 11: పంజాబ్ అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ (Golden Temple) సమీపంలో మరో పేలుడు (Blast) సంభవించింది. లంగర్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీగురు రామ్ దాస్ జీ సరాయ్ దగ్గర బుధవారం అర్థరాత్రి ఈ పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ సమీపంలో గత ఐదురోజుల్లో పేలుడు ఘటనలు చోటు చేసుకోవటం ఇది మూడోసారి. తాజాగా పేలుడు తరువాత ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పేలుడు ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిసింది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత 1గంట సమయంలో ఈ పేలుడు చోటు చేసుకున్న పేలుడు ఘటన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం చేరుకొని నమూనాలను సేకరించింది. అయితే, ఇప్పటి వరకు పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత ఐదు రోజుల్లో ఇది మూడో పేలుడు కావడంతో (Golden Temple) ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో సంభవించిన పేలుడు ప్రదేశం మొదటిసారి పేలుడు ప్రాంతానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ పేలుడు ఘటనపై పంజాబ్ పోలీసులు గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

గోల్డెన్ టెంపులు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. గత శనివారం గోల్డెన్ టెంపుల్ పార్కింగ్ స్థలంలో నిర్మించిన రెస్టారెంట్ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. రెస్టారెంట్ చిమ్నీ పేలడం వల్లే ఈ పేలుడు సంభవించిందని పోలీసు బృందం పేర్కొంది. అదేవిధంగా సోమవారం హెరిటేజ్ పార్కింగ్ స్థలంలో పేలుడు సంభవించింది. స్థానిక ఎఫ్ఎస్ఎల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని నమూనాలను సేకరించింది.