New York, AUG 29: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) (Rupa Reddy) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా (Telugu Student de in USA) వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. డెలావర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం న్యూయార్క్‌లోని జార్జ్ లేక్‌కు భారతదేశానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సరస్సు మధ్యలో పెద్ద రాయి కనిపించడంతో దానిపై నిలుచుని ఫొటోలు (Selfie) తీసుకునేందుకు ఎక్కారు. ఈ క్రమంలో రూపక్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజీవ్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు.
మిగిలిన స్నేహితులు రాజీవ్‌ను కాపాడగా, రూపక్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ టీం వచ్చి గాలించిం రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతులు, వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.