Arunachal Pradesh River: చైనా చేసిన పాపానికి అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ నది కళ తప్పింది. వేలాది జలచరాలు చనిపోయాయి. ఎప్పుడూ మంచినీటితో ప్రవహించే నది! ఒక్కసారిగా కళతప్పింది. నీళ్లన్నీ నల్లగా మారిపోయాయి. నదిలోని నీరంతా విషమయం అయ్యింది.

ఆ ఆశ్చర్యక‌ర‌మైన ఘ‌ట‌న‌ అరుణాచ‌ల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అక్కడ ప్రవహిస్తున్న కామెంగ్‌ న‌దిలోని నీరంతా ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. అయితే ఈ న‌దిలోని నీరంతా విష‌మ‌యం కావ‌డానికి చైనాయే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. చైనాలో య‌థేచ్ఛగా భారీ నిర్మాణాలు చేప‌ట్టడ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అక్కడి ప్రజ‌లు ఆరోపిస్తున్నారు.

న‌దిలో క‌రిగే వ్యర్థాల (టీడీఎస్) ప‌రిమాణం సాధార‌ణంగా లీట‌ర్ నీటిలో 300 నుంచి 1200 మిల్లీ గ్రాముల వ‌ర‌కు ఉండాలి. కానీ కామెంగ్ న‌దిలో 6800 మిల్లీ గ్రాముల టీడీఎస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని వ‌ల్లే కామెంగ్ న‌దిలోని నీరు అక‌స్మాత్తుగా న‌ల్లగా మారింద‌ని.. దీనివ‌ల్ల ఆ న‌దిలో ఉన్న జ‌ల‌చ‌రాలు శ్వాస పీల్చుకోవ‌డం సాధ్యం కాక మ‌ర‌ణించాయ‌ంటున్నారు.

 

ఇప్పటికే కరోనా మహమ్మారికి చైనాయే కారణమని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ చేసే చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అగ్రదేశాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు చైనాలో అక్రమ నిర్మాణాల వల్ల వేల సంఖ్యలో జలచరాల జీవనానికి ముప్పు వచ్చిపడింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.