Guwahati, August 27: ఆయన పేరు దిలీప్ కుమార్ పాల్. పాలను ఉత్పత్తి ఎలా పెంచాలో చెబుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. ఆయన చేసిన గీతోపదేశం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అస్సాం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ (Dilip Kumar Paul) తన నియోజకవర్గంలో ఇటీవల ఒక జానపద, సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీతం మరియు నృత్యం ఎంత శక్తివంతమైనవో వివరించారు. ఈ క్రమంలో ఆవులు పాలు బాగా ఇవ్వాలంటే కృష్ణుడి లాగా ఫ్లూట్ వాయించాలని చెప్పారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎలాంటి మురళి గానాన్ని వినిపించారో అలాంటి గానాన్ని ఆవుల ముందు వినిపిస్తే అవి అంతంకుముందు ఇచ్చేదాని కంటే రెంటింపు పాలను ఉత్పత్తి చేస్తాయి అని సెలవిచ్చారు. అంతేకాదు ఈ విధానం సైంటిఫిక్‌గా కూడా నిరూపించబడింది అని బల్లగుద్ది చెప్పారు. ఈ మధ్య సైంటిస్ట్ లు కూడా ఈ టెక్నిక్‌ను నమ్ముతున్నారట. ఆవుల్లో పాల ఉత్పత్తి పెంచేందుకు ఈ టెక్నిక్‌ను అమలు పరచబోతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.
దిలీప్ మాటలు విన్న అక్కడున్న ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు అనుమానంతో కూడిన ఉత్తేజం వల్ల వచ్చిన ఆశ్చర్యానికి లోనయ్యారు. వాస్తవానికి ఈ పాల్ గారు చెప్పిన పాల టెక్నిక్ నిజమేనేమో అని కొంతమంది అప్పుడే తమ ఆవుల ముందు ఫ్లూట్ వాయించి లీటర్ల కొద్దీ పాలు పితుక్కునేందుకు సిద్ధమవుతుండగా, చాలావరకు జాతీయ మీడియా, మరియు ప్రతిపక్ష నాయకులు పాల్ - పాల టెక్నిక్‌ను తప్పుబడుతున్నారు.
సంగీతానికి బండరాళ్లు కూడా కరుగుతాయి అని పెద్దలు చెపుతారు. అలాంటిది సంగీతానికి పాల ఉత్పత్తి పెరుగుతుందని పాల్ చెప్పడంలో పెద్ద తప్పపట్టాల్సిన అవసరం లేదు.
ఇక పాల్ గారి పాల టెక్నిక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీకాంలో ఫిజిక్స్ చేసిన వారు, డిగ్రీలో సీఈసీ చదివిన వారు, అలాగే గోదావరి నదిని ఏపీ నుంచి తెలంగాణ వైపు ప్రవహింపజేసిన వారు ఉండనే ఉన్నారు. అయితే వీరంతా ఒకటే కాలేజీలో చదివారా అనే అనుమానం మాత్రం కలుగుతుంది.