Golaghat, JAN 03: అస్సాంలో ఘోర రోడ్డు (Assam Accident) ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో (Bus Truck Collide) జరిగిన ఈ ప్రమాదంలో 14మంది మరణించారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమీపంలోని బలిజన్ గ్రామంలో ఈ రోడ్డు ప్రమాదం (Assam Accident) జరిగింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. వారు తెల్లవారుజామున 3గంటల సమయంలో అథ్ఖెలియా నుంచి విహార యాత్రకోసం తిన్సుకియాలోని తిలింగ ఆలయానికి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు.
Assam | Several people feared dead and many others were injured after the bus in which they were travelling collided with a truck near the Dergaon area in Assam's Golaghat district, today: Golaghat District Police
— ANI (@ANI) January 3, 2024
తెల్లవారు జామున 5గంటల సమయంలో మార్గరీటా నుంచి బొగ్గులోడుతో వస్తున్న ట్రక్కు, బస్సు బలంగా ఢీకున్నాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఇరుక్కుపోయారు. వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.