Meerut, July 08: ఒక సమోసా(samosa) తినాలంటే మనకు ఎంత టైం పడుతుంది! మహా అయితే ఐదు నిమిషాలు, లేకపోతే ఓ పది నిమిషాలు! కానీ యూపీలోని (UP) ఓ స్వీట్ షాపులో సమోసా తినాలంటే కనీసం గంట పడుతుంది. అయినా కూడా పూర్తిగా తినగలమన్న గ్యారెంటీ లేదు. ఇప్పటివరకు ఆ సమోసాను పూర్తిగా తిన్నవాళ్లు కూడా ఎవరూ లేరు. ఇంతకీ ఆ సమోసా స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? అదే బాహుబలి సమోసా(bahubali samosa). ఏకంగా 8 కిలోలుండే ఈ బాహుబలి సమోసాను అరగంటలో తింటే రూ. 51000 ఇస్తామని షాపు యజమాని బంపరాఫర్ కూడా ఇచ్చారు. బాహుబలి సమోసా(Bahubali samosa) ఛాలెంజ్‌లో పాల్గొని ఆకర్షణీయ నగదు బహుమతి గెలుచుకోవాలని యూపీలోని మీరట్‌లో (Meerut) ఓ స్వీట్ షాపు ఔత్సాహికులను ఆహ్వానిస్తోంది. అరగంటలో ఈ భారీ సమోసాను లాగించిన వారికి రూ 51,000 నగదు బహుమతి అందిస్తామని ప్రకటించింది. 8 కిలోల బాహుబలి సమోసాను 30 నిమిషాల్లో తినేయాలని ఆ స్వీట్ షాప్ సవాల్ విసిరింది.
ఏదో వినూత్నంగా చేయాలని కోరుకునే తాను సమోసాను వార్తలకెక్కించానని మీరట్‌లోని కౌశల్ స్వీట్స్ అధిపతి శుభం చెప్పుకొచ్చారు. బాహుబలి సమోసాను తయారు చేయాలని భావించిన తాము తొలుత 4 కిలోల సమోసా చేయాలనుకుని ఆపై 8 కిలోల సమోసా తయారు చేశామని చెప్పారు. ఈ భారీ సమోసా చేసేందుకు స్వీట్ షాపు యజమానులకు రూ 1100 ఖర్చయింది. ఈ సమోసాలో ఆలు, చీజ్, పల్లీలు, డ్రైఫ్రూట్స్ వినియోగించారు.
తాము విసిరిన ఈటింగ్ ఛాలెంజ్‌లో (Challenge) ఇంతవరకూ ఎవరూ విజయం సాధించలేదని, చాలా మంది ప్రయత్నించినా ఏ ఒక్కరూ లక్ష్యాన్ని చేరుకోలేదని శుభం చెప్పారు. బాహుబలి సమోసాను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫుడ్ బ్లాగర్లు వస్తున్నారని, ఇక్కడ వారు రీల్స్ చేసుకుంటున్నారని తెలిపారు. ఇక తాము పది కిలోల సమోసాను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్వీట్ షాపు అధినేత చెబుతున్నారు.