Thiruvananthapuram, March 17: ఒక కూలీ రూ.75 లక్షల లాటరీ గెలిచాడు (wins lottery). అయితే భయాందోళన చెందిన అతడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు. తన లాటరీ టికెట్ ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. విస్తూపోయే ఈ సంఘటన కేరళలో జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు (West Bengal) చెందిన ఎస్‌కే బాదేశ్ వలస కూలీగా కేరళకు వచ్చాడు. ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నాడు. కేరళ (Kerala) ప్రభుత్వం విక్రయించే లాటరీ టికెట్‌ను ఇటీవల అతడు కొన్నాడు. మంగళవారం రాత్రి ఫలితాలు చూసుకున్న అతడు తాను కొన్న లాటరీ టికెట్‌కు రూ.75 లక్షలు గెలుచుకున్నట్లు తెలుసుకున్నాడు.
కాగా, బెంగాల్‌కు చెందిన బాదేశ్ (Badesh), కేరళకు కొత్తగా రావడం, మలయాళం తెలియకపోవడంతో ఏమి చేయాలో అతడికి తెలియలేదు. భయాందోళన చెందిన అతడు వెంటనే తన స్నేహితుడు కుమార్‌ను పిలిచి సహాయం కోరాడు. ఆ తర్వాత అతడితో కలిసి మువట్టుపుజ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాను గెలిచిన లాటరీ టికెట్‌ను ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని కోరాడు. అలాగే లాటరీ డబ్బులు ఎలా పొందాలి అని కూడా పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులు లాటరీ డబ్బు తీసుకునే విధానం గురించి వివరించారు. అలాగే అతడికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
మరోవైపు బాదేశ్ గతంలో కూడా చాలాసార్లు లాటరీ టికెట్లు కొన్నాడు. ఎప్పుడూ కూడా డబ్బులు గెలుచుకోలేదు. అయితే కేరళలో కొన్న లాటరీకి ఏకంగా రూ.75 లక్షలు తగలడంపై అతడి ఆనందానికి అంతులేకుండా పోయింది. కేరళలో తనకు అదృష్టం దక్కడం పట్ల అతడు మురిసిపోయాడు. లాటరీ డబ్బులు పొందిన తర్వాత బెంగాల్‌లోని సొంతూరుకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటిని బాగు చేయించుకోవడంతోపాటు మరికొంత పొలం కొని వ్యవసాయం చేసుకోవాలని భావిస్తున్నాడు