Mumbai, September 21: మహారాష్ట్రలోని భీవండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజూమున మూడంతస్తుల భవనం (Bhiwandi Building Collapse) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా.. మరో 20 మందిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్నది స్పష్టంగా తెలియరాలేదు. భీవండీ పట్టణంలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. భవనంలో దాదాపు 21 ఫ్లాట్లు ఉన్నాయి. నివాసితులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బీవండీ (Bhiwandi Building) నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు సగం ఆదివారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్ల నివాసులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘటనతో బీవండీ నగరంలోని పటేల్ కాంపౌండులో గందరగోళం నెలకొంది.
మృతులకు ప్రధాని మోదీ సంతాపం
మహారాష్ట్రలోని బీవండిలో మూడంతస్థుల భవనం కూలిన దుర్ఘటనలో మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవనం కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని చెప్పారు. వారికి కావాల్సిన సహాయం అందిస్తామని వెల్లడించారు.