
New Delhi, January 2: దేశ రాజధాని దిల్లీలోని పీరాగరి ప్రాంతం (Peeragarhi area) లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. బ్యాటరీలు భద్రపరిచే ఓ గిడ్డంగిలో ఈ ప్రమాదం చేసుకుంది. మంటలను అదుపులోకి చేసేందుకు కొంతమంది అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. అయితే ఈ సమయంలో అగ్నిప్రమాదం కారణంగా బ్యాటరీలు ఒక్కసారిగా పేలాయి. ఈ పేలుడు ధాటికి ఆ భవంతి కూడా కొంత భాగం కూలిపోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహా మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కనీసం 14 మంది గాయపడినట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. గాయపడిన 14 మందిలో 13 మంది అగ్నిమాపక సిబ్బందే ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మొత్తం 35 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
డిఎఫ్‌ఎస్ (Delhi Fire Services ) చీఫ్ అతుల్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం తెల్లవారుఝామున 4:23 సమయంలో బ్యాటరీ కార్మాగారంలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందింది. అనంతరం అకస్మాత్తుగా పేలుడు సంభవించింది, దీనివల్ల భవనం కూలిపోయిందని తెలిపారు. అయితే భవనంలో ఎంతమంది ఉన్నారు? శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. దిల్లీలో వారం రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనం కాగా, మరికొంత మంది గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటన పట్ల దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.