Bombay, Aug 04: బాంబే హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ డియో (Rohit Deo) శుక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. (Bombay High Court judge resigns) ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని ఆయన అన్నారు. బాంబే హైకోర్టు (Bombay High Court) నాగపూర్ బెంచ్‌కు న్యాయమూర్తిగా ఉన్న రోహిత్ డియో, శుక్రవారం ఉదయం కోర్టులో అందరి ముందు తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ‘నేను రాజీనామా సమర్పించా. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నా. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను. మీరు కష్టపడి పని చేయండి’ అని కోర్టులో ఉన్న న్యాయవాదులతో ఆయన అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్టు తెలిపారు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా లేఖను పంపినట్లు వెల్లడించారు.
కాగా, తన రాజీనామాకు ఎలాంటి కారణాలను న్యాయమూర్తి రోహిత్ (Rohit Deo) వెల్లడించలేదు. అయితే కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించడంపై న్యాయవాదులకు క్షమాపణలు చెప్పారు. ‘కోర్టుకు హాజరైన వారికి, ప్రతి ఒక్కరికి నేను క్షమాపణలు చెబుతున్నా. మీరు బాగుపడాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని తిట్టాను. మీరంతా నా కుటుంబంలాంటి వారు. అందుకే మీలో ఎవరినీ బాధపెట్టాలని నేను కోరుకోను’ అని అన్నారు. న్యాయమూర్తి రోహిత్ డియో రాజీనామా ప్రకటనపై కోర్టులోని న్యాయవాదులంతా షాక్ అయ్యారు.
న్యాయమూర్తి రోహిత్ డియో 2017లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్‌గా ఉన్నారు. ఆ ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 ఏప్రిల్‌లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2025 డిసెంబర్ 4న పదవీ విరమణ చేయాల్సి ఉండగా శక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు.
మరోవైపు మైనర్ ఖనిజాల అక్రమ తవ్వకాలకు సంబంధించి సమృద్ధి మహామార్గ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లపై శిక్షార్హత చర్యలను రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీర్మానించింది. జస్టిస్ రోహిత్ డియో జూలై 26న దీనిపై స్టే విధించారు. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడానికి ఇది కారణం కావచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.