Raigad, August 24: మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలోని మహద్ అనే పట్టణంలో సోమవారం ఓ బహుళ అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది గాయపడగా, మరో 70 మంది వరకు శిథిలాల్లోనే చిక్కుకు పోయినట్లు సమాచారం. ఐదు అంతస్తులు ఉండే ఈ అపార్టుమెంట్ లో మొత్తం 45 ఫ్లాట్లు ఉన్నట్లు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) తక్షణమే మూడు బృందాలుగా ముంబై నుంచి బయలుదేరింది. ఘటనా స్థలం ముంబై నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ప్రయాణ సమయం 4 గంటలు పడుతుంది.
ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు, అవసరమయ్యే అన్ని సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని స్థానిక కలెక్టర్ మరియు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పారు. రాయ్‌గడ్ జిల్లా యొక్క ఇంచార్జ్ మంత్రి అదితి తత్కరే కూడా ఘటనా స్థలానికి బయలుదేరింది.
"ఈరోజు సాయంత్రం 6,50 గంటలకు, మహారాష్ట్ర జిల్లా రాయ్‌గడ్ లోని మహద్ తహసీల్‌లోని కాజల్‌పురా ప్రాంతంలో ఒక గ్రౌండ్ + నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. సుమారు 50 మందికి పైగా శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం అందింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ యొక్క మూడు బృందాలు అవసరమయ్యే అన్ని రకాల ఎక్విప్‌మెంట్లతో తరలివెళ్లాయి" అని ఎన్డిఆర్ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
Video From The Accident Site:
BIG BREAKING
5 Story building collapse in #Maharashtra #Raigad 50-70 people fear to trapped#raigad #RaigadBuildingCollapse pic.twitter.com/B88EtzygU8
— Amit Sahu (@AmitSahu_Journo) August 24, 2020
మహారాష్ట్ర ప్రమాదాన్ని విషాదకరమైనదిగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడి, సాధ్యమైనంత సహాయం అందించాలని అన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దంతో దట్టమైన దుమ్ము ఆవరించబడిన మేఘం లాగా అక్కడి ప్రదేశం కనిపించిందని స్థానికులు తెలిపారు. భారీ వర్షాల కారణంగానే చుట్టూ నీరు చేరి ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
గత నెలలో కూడా ముంబైలో కురిసిన భారీ వర్షానికి ఓ బహుళ అంతస్తుల భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.