New Delhi, March 10: త్రివిధ దళాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టే వివాదస్పద అగ్నిపథ్ పథకానికి మరింత ప్రచారం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మాజీ అగ్నివీరులకు (Agniveers) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించింది. గరిష్ట వయో పరిమితిలో కూడా సడలింపు ఇచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. దీని కోసం సరిహద్దు భద్రతా దళంలోని జనరల్ డ్యూటీ కేడర్ (నాన్ గెజిటెడ్) రిక్రూట్‌మెంట్ రూల్స్ 2015ను సవరించినట్లు పేర్కొంది. ఆ తర్వాత సంబంధిత నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించింది. మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ (Reservation) వర్తింపు ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది.
Central govt has declared 10% reservation for ex-Agniveers in vacancies within BSF as well as relaxed upper age-limit norms depending on whether they are part of the first batch or subsequent batches. MHA made the announcement through a notification dated 6th March pic.twitter.com/dn100tXQ7j
— ANI (@ANI) March 10, 2023
కాగా, మాజీ అగ్నివీరుల మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతర బ్యాచ్‌ల అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో పరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. అలాగే మాజీ అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి కూడా మినహాయింపు ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మరోవైపు ఆర్మీ (Army), నేవీ (Navy), వైమానిక దళాల్లో 17-21 ఏళ్ల యువకులను తాత్కాలికంగా నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 14న అగ్నిపత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో రిక్రూట్ చేసుకునే వారిని అగ్నివీరులుగా వ్యవహరిస్తారు. గరిష్టంగా నాలుగు సంవత్సరాలు స్వల్పకాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందించనున్నారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ప్రతి బ్యాచ్‌లో 25 శాతం మంది అగ్నివీరులను రెగ్యులర్ సర్వీస్ కోసం తీసుకుంటారు. మిగతా వారిని పారామిలిటరీ దళాల్లో చేర్చుకునేందుకు రిజర్వేషన్లు కల్పించారు. అయితే త్రివిధ దళాల్లో కాంట్రాక్ట్ పద్ధతి నియామకాలను విపక్షాలు వ్యతిరేకించాయి. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.