Chennai, Nov 27: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి ‘ఫెంగల్’ అని నామకరణం చేశారు. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ తుఫాను గురువారం రాత్రి చెన్నై సమీపంలోకి రావొచ్చని, శనివారం చెన్నై - పుదుచ్చేరి(Chennai - Puducherry) మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ తుఫాను మొదట చెన్నై - నాగపట్టణం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేయగా, ప్రస్తుతం ఈ తుఫాను దిశ మార్చుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై - పుదుచ్చేరి మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ భావిస్తోంది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వుంది. అలలు ఐదడుగుల ఎత్తుకుపైగా ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొద్దని వాతావారణ శాఖ అధికారులు సూచించారు.
ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడులోని 25 జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 29, 30వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది.చెన్నై, కడలూరు, పుదుచ్చేరి, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూర్, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు
తుఫాను చెన్నైను తాకితే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు 18 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. అలాగే, నగర వ్యాప్తంగా 35 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.12 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. చెన్నై నగరంలోని 12 డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందం తరపున 12 సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. నగర వ్యాప్తంగా 35 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పనిచేసేలా సిబ్బందిని నియమించారు. అలాగే, 800 అగ్నిమాపకదళ ఇబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.
ప్రస్తుతం ఇది బుధవారం సాయంత్రానికి నాగపట్టణానికి 370 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిమీ, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైవుంది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావారణ శాఖ తెలిపింది. ఇది గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి చెన్నై సమీపానికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సమయాల్లో గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడతాయి. కారైకాల్ మరియు పుదుచ్చేరి మరియు చెన్నైలోని కొన్ని ప్రాంతాలలో పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడతాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
తమిళనాడు తీరప్రాంతంలో IMD ఎల్లో అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తమిళనాడు తీర ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్‌లు, హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుతురై, రామనాథపురం, తిరుచ్చి సహా తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.