మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'సైరా నరసింహ రెడ్డి' గాంధీ జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో చిరంజీవి ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించబోతున్నారు. ఈ విషయం అటుంచితే, మెగాస్టార్ తాను తదుపరి నటించబోయే చిత్రంపై కూడా ఒక క్లారిటీకి వచ్చేశారా? అంటే కొన్ని రిపోర్ట్స్ అవుననే చెపుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరంజీవి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. మళయాలంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ' 'లూసిఫర్' (Lucifer) సినిమా హక్కులను చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా డైరెక్టర్ పృథ్వీ రాజ్ ( Prithviraj Sukumaran ) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మళయాలంలో నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రంగా లూసిఫర్ నిలిచింది. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి స్టార్లు నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసింది.
Prithviraj Sukumaran Tweet:
With #Chiranjeevi sir at the Kerala launch of #SyeraNarasimhaReddy What an absolute gem of a man! Humility and grace personified. I’m thrilled that you bought the rights to #Lucifer and will forever be sorry that I couldn’t take up your offer to be part of #SNR sir! 🙏 pic.twitter.com/thGsUoRLAG
— Prithviraj Sukumaran (@PrithviOfficial) September 30, 2019
ఆసక్తికరమైన సినిమా కథ
రాష్ట్రాన్ని పాలించే ఒక మహానేత చనిపోయినపుడు ఆ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. దీంతో తర్వాత సీఎం ఎవరు అనే దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతాయి. కొంతమంది ఆ దివంగత నేత కుమార్తెనే సీఎం కావాలని కోరుకోగా, మరికొంత మంది ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి అధికారం తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పట్నించీ రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతాయి, అలాంటి దుర్మార్గుల నుంచి ప్రజలను కాపాడేందేందుకు ఒక లీడర్ వెలుగులోకి వస్తాడు. ఇదీ కథాంశం.
ఈ కథ తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే చిరంజీవి ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారా అని సందేహం కలుగక మానదు. చిరంజీవి కూడా సినిమాల్లోంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినపుడు రాజకీయాల్లో అస్థిరత చోటుచేసుకుంది, ఆ తర్వాత రాజకీయ ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. తదనంతర పరిణామాలతో
చిరంజీవి రాజకీయాల్లోంచి తప్పుకొని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకున్న చిరంజీవి మళ్ళీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ రీమేక్ చిత్రంలో చిరంజీవి నటిస్తారన్న విషయాన్ని ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు కానీ, మళయాలంలో లీడర్ పాత్రను మోహన్ లాల్ చేయడం ద్వారా, తెలుగులో అంతటి స్టేచర్ ఉన్న స్టార్ చిరంజీవి మాత్రమే, కాబట్టి ఈ సినిమాలో లీడ్ రోల్ ఆయనే నటిస్తారనే ప్రచారం జరుగుతుంది.
చిరంజీవి కొనుగోలు చేసిన ఈ లూసిఫర్ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ఇప్పటికే తెలుగులో విడుదలైంది. అయితే, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. మరి అలాంటి చిత్రాన్ని మరోసారి తెలుగులో నిర్మించినపుడు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణానికి తగ్గట్లుగా కథలో ఏమైనా మార్పులు చేస్తే, అందులో గనుక చిరంజీవి నటిస్తే మాత్రం ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.