Sukhpal Singh Khaira Arrest (PIC@ ANI X)

Chandigarh, SEP 28: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ డ్రగ్స్‌ సంబంధిత కేసులో (Drugs Case) భోలాత్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను (Sukhpal Singh Khaira) గురువారం ఉదయం చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(NDPS) చట్టం కింద గతంలో నమోదైన కేసులో భాగంలో జలాలాబాద్ పోలీసులు ఈ ఉదయం ఎమ్మెల్యే నివాసంలో సోదాలు జరిపారు. పోలీసుల తనిఖీల సమయంలో ఎమ్మెల్యే ఖైరా (Sukhpal Singh Khaira Arrest) ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఏర్పాటు చేశారు. ఈ వీడియోలో తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని పోలీసులతో సుఖ్‌పాల్‌ సింగ్‌ వాగ్వాదానికి దిగారు. అరెస్ట్‌కు సంబంధించి‌ వారెంట్‌ చూపించాలని అడగటం కూడా కనిపిస్తోంది. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే ఖైరాను అదుపులోకి తీసుకున్నారు.

 

ఎమ్మెల్యే అరెస్ట్‌ను (MLA Arrest) అతని కుటుంబ సభ్యులు అడ్డుకోగా బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. అనంతరం జలాలాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ఠ్‌పై జలాలాబాద్ డీఎస్పీ అచ్చు రామ్‌ శర్మ మాట్లాడుతూ.. పాత ఎన్‌డీపీఎస్‌ కేసులో ఖైరాను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని, అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు.