
New Delhi, FEB 26: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్ర (yatra) చేపట్టనున్నారు. ఈసారి తూర్పు నుంచి పడమర వరకు (East to west yatra) పాదయాత్ర చేయనున్నారు. దీని కోసం ప్లాన్ సిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆయన కోరారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. అయితే ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ద్వారా చేపట్టిన ‘తపస్సు’ను ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ప్రణాళికను రూపొందించాలని పార్టీని ఆయన కోరారు. తనతోపాటు దేశ ప్రజలు అందులో పాల్గొనేలా యాత్రను ఖరారు చేయాలని సూచించారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అని, ఆ త్యాగం, కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. ‘దయచేసి మా చెమట, రక్తంతో ఒక కార్యక్రమం చేయండి. అప్పడు దేశం మొత్తం మనతో ఉంటుంది’ అని అన్నారు.
కాగా, 2024 సాధారణ ఎన్నికలకు సమాయత్తంగా ఈసారి తూర్పు నుంచి పడమర వరకు రాహుల్ గాంధీ యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది. భారత్ జోడో యాత్ర తరహాలో దీనిని చేపట్టనున్నది. ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసారి తూర్పు నుంచి పడమర వరకు చేపట్టే యాత్ర, భారత్ జోడో యాత్ర కన్నా కాస్త భిన్నంగా ఉండవచ్చని అన్నారు.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగేలా రూట్‌ను రూపొందిస్తున్నట్లు జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. చాలా వరకు పాదయాత్రగా సాగే ఈ యాత్రలో చాలా తక్కువ మంది పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మార్గంలో అటవీ ప్రాంతాలు, నదులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని మరో యాత్ర ఈ ఏడాది జూన్ లోపు ప్రారంభం కావచ్చని వెల్లడించారు.