Congress Manifesto (PIC@ Congress Twitter)

Bangalore, May 02: కర్ణాటక ఎన్నికల (Karnataka Elections 2023) కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (Congress manifesto) విడుదల చేసింది. మహిళలు, యువతతో పాటూ అన్ని వర్గాల ప్రజలకు వరాలు కురిపించింది కాంగ్రెస్. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతినెలా రూ. 2వేలు చెల్లిస్తామని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఖాళీగా ఉన్న యువతకు రెండేళ్లపాటూ నెలకు రూ. 3వేల భృతి అందిస్తామని మేనిఫెస్టోలో (Congress manifesto) చేర్చింది కాంగ్రెస్. దీంతో పాటూ దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, అలాగే ప్రతినెలా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి అన్నభాగ్య పథకం ద్వారా 10కేజీల బియ్యం లేదా గోధుమలు, మిల్లెట్స్ అందిస్తామని మేనిఫెస్టోలో చేర్చింది.

ఇక మహిళలకు శక్తి పథకం ద్వారా అన్ని కేఎస్‌ఆర్టీసీలో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మతతత్వ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. మతాలపేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టే భజరంగ్ దళ్ (Bajrangdal), పీఎఫ్‌ఐ వంటి సంస్థలను ఉపేక్షించమని కూడా కాంగ్రెస్ తెలిపింది. బెంగళూరువాసు కోసం అపార్ట్ మెంట్‌ చట్టాన్ని సవరిస్తామని కూడా ప్రకటించింది.

అటు మత్స్యకారులకు ప్రతి సంవత్సరం రూ. 6వేల రూపాయలతో పాటూ, చేపల వేటకోసం వెళ్లేవారికి ఏటా 500 లీటర్ల డీజిల్ ఉచితంగా అందిస్తామని కూడా తెలిపింది. ఇక వ్యవసాయం కోసం రైతులకు రూ. 10లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని, ఆవుపేడను కిలో రూ.3 కొంటామని ప్రకటించింది.

పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేయగా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధారామయ్యతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.