Chennai, FEB 17: పీచు మిఠాయి.. (Cotton Candy) ఈ పేరు వినగానే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. పెద్దలు కూడా ఈ మిఠాయిని తినేందుకు ఆసక్తి చూపుతారు. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది పీచు మిఠాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Govt) కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి (Cotton Candy Baned) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని, అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా పీచు మిఠాయిల్లో రోడమైన్-బీ అనే కెమికల్‌ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగిస్తున్నట్లు తేలింది.
సాధారణంగా ఈ రోడమైన్ బీని ఇండస్ట్రీయల్ డైగా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రోడమైన్-బీ అనే కెమికల్ మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. అంతేకాకుండా అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
#TamilNadu government bans #cottoncandy pic.twitter.com/8muvopqivg
— TNIE Tamil Nadu (@xpresstn) February 17, 2024
ఈ క్రమంలో తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించారు. పీచు మిఠాయి తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుబ్రమణియన్ ఆదేశించారు.