Covid XBB 1.16 Variant: మళ్లీ వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్‌, నాలుగో వేవ్ తప్పదనే భయాలు, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది.అంతా తగ్గిపోయిందనుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ తో పాటు ఇన్‌ఫ్లూయెంజా కేసులు దడ పుట్టిస్తున్నాయి. భారత్ లో తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది.అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‍ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు.

అయితే భారత్‌లో రానున్న రోజుల్లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు.

కరోనా ఇంకా పోలేదు, ఒమిక్రాన్ ఉపవేరియంట్ XBB.1.5తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్‌లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్‌లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్‌లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్‌స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్‌ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే.

చైనాలో మళ్లీ లాక్‌డౌన్, వణికిస్తున్న కొత్త ఫ్లూ ఇన్‌ఫ్లూయెంజా కేసులు, జియాన్ ఫ్రావిన్స్‌లో కరోనా తర్వాత తొలిసారిగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు

ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్‌ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు.

ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తరుణంలో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు బుధవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్‌ పైనా దృష్టిసారించాలని ఆరోగ్య శాఖ లేఖల్లో ఆయా రాష్ట్రాలను కోరింది.

గత శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ సైతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని కోరారు. దాదాపు నాలుగు నెలల తర్వాత బుధవారం 700కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల(4,623) పైకి చేరింది. యాక్టివ్‌ కేసుల శాతం 0.01 శాతంగా ప్రస్తుతానికి ఉండగా, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది.