Hathras Stampede

Hathras, July 03: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హాథ్రాస్‌లో బోలే బాబా స‌త్సంగ్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌(Hathras Stampede)లో మృతిచెందిన వారి సంఖ్య‌ (Death Toll) 121కి చేరింది. ఆ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య 28గా న‌మోదు అయ్యింది. హాథ్రాస్ విషాదం (Hathras Stampede) ప‌ట్ల ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. తొక్కిస‌లాట‌కు కార‌ణ‌మైన వారిని శిక్షించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే ఇవాళ ద‌ర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు తొక్కిస‌లాట జ‌రిగిన ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు. అలీఘ‌డ్‌లోని ఏఎస్పీ అమృత్ జెయిన్ మాట్లాడుతూ.. హాథ్రాస్ జిల్లా నుంచి 38 మంది మృత‌దేహాలు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఆ 36 మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ పూర్తి అయిన త‌ర్వాత ఆ మృత‌దేహాల‌ను వారి వారి కుటుంబాల‌కు పంపిన‌ట్లు ఆయ‌న చెప్పారు. గుర్తు తెలియ‌ని మృత‌దేహాల ఫోటోల‌ను స‌మీప జిల్లాల‌కు పంపిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

 

హాథ్రాస్ తొక్కిస‌లాట ఘ‌ట‌న ప‌ట్ల సీబీఐ (CBI) ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అల‌హాబాద్ హైకోర్టులో అడ్వ‌కేట్ గౌర‌వ్ ద్వివేది పిల్ దాఖ‌లు చేశారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం వ‌ద్ద డాగ్ స్క్వాడ్‌తో ఫోరెన్సిక్ నిపుణులు సెర్చ్ చేస్తున్నారు. మ‌రోవైపు మెయిన్‌పురి జిల్లాలో ఉన్న బోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిట‌బుల్ ట్ర‌స్టు ఆశ్ర‌మానికి భ‌క్తులు వ‌చ్చిపోతున్న‌ట్లు డిప్యూటీ ఎస్పీ సునిల్ కుమార్ తెలిపారు. ఆశ్ర‌మానికి రాకుండా ఎవ‌ర్నీ ఆప‌డం లేద‌న్నారు.

 

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన వారిపై భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టంలోని 105, 110, 126(2), 223, 238 సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య సేవ‌దార్‌గా ఉన్న దేవ్‌ప్ర‌కాశ్ మ‌ధుక‌ర్‌పై కేసు బుక్ చేశారు. బోలే బాబా ఆశ్ర‌మంలో ప్ర‌స్తుతం సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.