Delhi Air Pollution (Photo Credits: ANI)

New Delhi November 13:  ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్య తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే రెండు రోజులు లాక్‌డౌన్ విధించి అయినా సరే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది అత్యున్నత ధర్మాసనం. వాయునాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకొని తిరిగాల్సిన దుస్ధతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో పరిస్థితి ఎంత దిగజారిందో మీరే చూడండి. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అయితే వాటిని దహనం చేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే పంజాబ్‌లో రైతులు పంట వ్యర్ధాలను దహనం చేయడం వల్లనే వారం రోజులుగా వాయు కాలుష్యం పెరిగిందని, దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు.

అటార్నీ చెప్పిన సమాధానంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని ఎందుకు ఒక అంచనాకొస్తున్నారు? ఈ కాలుష్య పరిస్థితులకు అది ఒక కారణం మాత్రమే. మిగిలిన వాటి గురించి ఏం చెప్తారు? కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో మాకు వెంటనే తెలియజేయండి. రెండు రోజుల లాక్‌డౌన్ ఏమైనా విధిస్తారా?’ అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకొని వాయుకాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలను చేపట్టాలని సూచించింది.

ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత చాలా దారుణంగా మారింది. వాయు నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పలు చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కి దిగువన పడిపోయింది. నోయిడాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ వాయినాణ్యత 772కు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.