New Delhi, November 1: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పీల్చే గాలి స్వచ్ఛత (air quality) ప్రమాదకర స్థాయికి క్షీణించింది. ఇప్పటికే ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. వాయుకాలుష్య తీవ్రత దారుణంగా పెరిగిపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని స్కూళ్లకు, కాలేజీలకు నవంబర్ 05 వరకు సెలవులు ప్రకటించారు. విపరీతంగా పెరిగిన వాహనాలతో వాటి నుంచి వచ్చే పొగ, దీపావళి సందర్భంగా కాల్చిన బాణాసంచా మరియు చుట్టు పక్క రాష్ట్రాలలో వ్యర్థాలు తగలబెట్టం ద్వారా గాలిలో కలిసిన పొగ అన్ని కలిసి ఢిల్లీ నగరాన్ని కమ్మేశాయి.
దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-NCR ప్రాంతంలో 'ప్రజారోగ్య అత్యవసర స్థితి' (Health Emergency)ని ప్రకటించింది. ఢిల్లీలో నవంబర్ 05 వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని, అలాగే రాబోయే శీతాకాలం సీజన్ మొత్తానికి కూడా ఎవరు బాణాసంచా కాల్చకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి (EPCA) కి సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఫరీదాబాద్, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా , బహదూర్ ఘడ్, పానిపట్ పరిసర ప్రాంతాలలో బొగ్గు, ఇంధనం లాంటి కాలుష్యానికి కారకమయ్యే పరిశ్రమలన్నీ నవంబర్ 05 వరకు మూసేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ఇండియా ప్రకారం, ఈ ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 412గా నమోదైంది. ఇది "అతి తీవ్రమైన" వాయుకాలుష్యం కేటగిరిగా పరిగణించబడుతుంది. శుక్రవారం ఢిల్లీ నగరం అంతటా దట్టమైన పొగమంచు ఏర్పడినట్లుగా హానికర పొగ ఒక దుప్పటిలాగా పరుచుకుంది.