Representational Image | (Photo Credits: PTI)

New Delhi, February 10: దిల్లీలో ఓ మహిళా కళాశాలలో జరిగిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 6న దిల్లీలోని గార్గి మహిళా కళాశాలలో (Gargi College) విద్యార్థినులు రెవరీ (Reverie) పేరుతో మూడు రోజుల 'కాలేజ్ ఫెస్ట్' (Women College Fest)  కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి గార్గి కళాశాలతో పాటు దిల్లీ యూనివర్శిటీ పరిధిలో చదివే అమ్మాయిలంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు. దిల్లీ యూనివర్శిటీ పరిధిలో చదివే కొంత మంది బాలురకు అనుమతి ఉంది. అయితే యువతులంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తమ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ, దురదృష్టవశాత్తూ అనుకోని ఘటన జరిగింది. బాగా తాగేసి ఉన్న ఒక మూక అమ్మాయిల మధ్యలోకి చొరబడ్డారు.

బయట రోడ్డుపై 'పౌరసత్వ చట్టానికి మద్ధతుగా' భారీ ర్యాలీ జరుగుతుంది. వారంతా పెద్ద ఎత్తున అమ్మాయిల ఫెస్ట్ లోకి చొరబడి, అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఫిబ్రవరి 06, సాయంత్రం 4:30 నుండి ప్రారంభమైన వారి పైశాచికత్వం రాత్రి 9 గంటల వరకు, గంటల పాటు కొనసాగింది.

చివరకు అమ్మాయిల వాష్ రూంలలోకి చొరబడి కూడా తమ పైశాచికత్వం చూపారంటే అర్థం చేసుకోవచ్చు, వారి దారుణానికి అసలు అడ్డేలేకుండా పోయింది. మహిళా కాలేజీలో ఉండే సెక్యూరిటీ పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోంది.

ఇంత జరిగినా ఆ కాలేజీ యాజమాన్యం ఈ సంఘటన బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. అయితే కొంతమంది యువతులు ధైర్యం చేసి తమపై ఎంతటి దారుణం జరిగిందో పూసగుచ్చినట్లుగా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

"అక్కడ తాగిన, మధ్య వయస్కులైన పురుషులు మమ్మల్ని వేధించడం, మమ్మల్ని వేధించడం మరియు హస్త ప్రయోగం చేయడం జరిగింది ... ఆ గుంపు లోపల ఉన్న పురుషుల బృందం నన్ను మూడుసార్లు పట్టుకుంది మరియు నేను అరిచినప్పుడు వారు నవ్వారు ...".

"వారంతా తాగేసి ఉన్నారు, అందరూ మాకంటే వయసులో చాలా పెద్ద, మధ్య వయసున్న పురుషులు, మమ్మల్ని తీవ్రంగా వేధించారు, మాపై హస్త ప్రయోగం చేశారు, ఒక గ్యాంగ్ నాపై మూడు సార్లు తీవ్ర అసభ్యంగా ప్రవర్తించింది" అంటూ ఓ విద్యార్థిని వాపోయింది.

"గార్గి కాలేజీ యాజమాన్యంపై అసహ్యం వేస్తుంది. నా జీవితంలో ఇలాంటి ఒకరోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అమ్మాయిల కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. ఒక గుంపు నాపై మూకుమ్మడి దాడి చేసి, ఒక్కొక్కడు ఒక్కోరకంగా నా శరీర భాగాలపై తాకుతూ వికృత చేష్టలు చేశారు. మీకు సిగ్గులేదా? అమ్మాయిలకు భద్రత కూడా ఇవ్వరా?" అంటూ కాలేజీ యాజమాన్యాన్ని తీవ్రంగా నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

A tweet regarding the shameful incident:

ఇలా చాలా మంది యువతులు తమ బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొంతమంది యువతులు ఇప్పటికీ షాక్ లో ఉండిపోయి, ఎవరికీ కాంటాక్ట్ లో లేకుండా పోయారు. వీరి సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి.

మీడియాలో కూడా రావడంతో  జాతీయ మహిళా కమీషన్' ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అధికారుల బృందం నేరుగా గార్గ్ కాలేజీ చేరుకొని విచారించగా, ఊహించని విధంగా తప్పు జరిగిపోయింది అని ప్రిన్సిపల్ సమాధానం చెప్పింది. "జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నాం, అమ్మాయిలూ మమ్మల్ని క్షమించండి" అంటూ కాలేజీ పరిపాలనా విభాగం బహిరంగా క్షమాపణ పత్రం విడుదల చేసింది. ఈ కేసును దిల్లీ పోలీసులు సుమోటో గా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు.