New Delhi, February 25: గత కొంతకాలంగా పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు (Anti CAA Protests) దేశంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు (Donal Trump India Visit) వచ్చే ఒక్కరోజు ముందు ఆదివారం ఈశాన్య దిల్లీ (North East Delhi) ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. CAA అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మొదలైన వివాదం సోమవారం ఘర్షణలకు దారితీసింది. ఇరు వర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. సోమవారం చెలరేగిన ఈ హింసాకాండ సందర్భంగా మరణించిన వారి సంఖ్య 07కు చేరింది ఇందులో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కూడా ఉన్నారు. ఘర్షణలు అదుపు చేసే క్రమంలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో హింసాకాండ (Violence) జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక డిప్యూటీ పోలీస్ కమిషనర్ సహా మొత్తం 105 మందికి పైగా గాయాలయ్యాయి. డీసీపీకి సర్జరీ చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆయన కోలుకున్నారని వైద్యులు తెలిపారు.
అల్లరిమూకలు ఇళ్ళు, దుకాణాలు, వాహనాలు మరియు పెట్రోల్ పంపులను తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్ళ వర్షం కురిపించుకోవడం, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకోవడంతో ఈశాన్య దిల్లీ సోమవారం యుద్ధభూమిని తలపించింది.
ఇదిలా ఉండగా, ఆందోళనకారుల్లో కొంతమంది తుపాకులను కలిగి ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం. ఓ వ్యక్తి తుపాకీ చూపిస్తూ బెదిరిస్తున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఘర్షణల సందర్భంగా దిల్లీ పోలీసులపై సోమవారం కాల్పులు జరిపిన వ్యక్తిని షారుఖ్‌గా గుర్తించారు. భాష్పవాయువు ప్రయోగించి పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు 8 రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు పేర్కొన్నారు.
పరిస్థితులను అదుపు చేసేందుకు ఈశాన్య దిల్లీలోని 10 ప్రాంతాలలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్-బాబర్పూర్, గోకాల్‌పురి, జోహ్రీ ఎన్‌క్లేవ్, శివ విహార్, జాఫ్రాబాద్, మౌజ్‌పూర్-బాబర్పూర్, ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మరియు జనపథ్ ప్రవేశ ద్వారాలు మూసివేశారు. భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరించారు, అనంతరం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
గత రెండు రోజులుగా జరిగిన ఈ అల్లర్లతో ఇప్పటికీ ఈశాన్యంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. దేశ రాజధానిలో కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
దిల్లీ హింసాకాండ తాజా పరిణామాలపై సమీక్షించేందుకు మంగళవారం అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అర్వింద్ కేజ్రీవాల్ , నగర పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా, బిజెపి నాయకులు మనోజ్ తివారీ, రాంబిర్ సింగ్ బిధురి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
హోంశాఖ సహాయ మంత్రి కూడా జి. కిషన్ రెడ్డి కూడా దిల్లీ పరిణామాలను గమనిస్తున్నారు. అల్లర్లకు పాల్పడే ఎంతటి వారైనా విడిచిపెట్టం అని ఆయన హెచ్చరించారు. ట్రంప్ పర్యటన సమయంలో చెడ్డపేరు రావాలని కావాలనే కొంతమంది అల్లర్లను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఎఎ వలన ఏ ఒక్క భారతీయుడికి కూడా అన్యాయం జరగదని ఆయన పునరుద్ఘాటించారు.