New Delhi, August 26: పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబడే ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఆర్టికల్ 370 రద్దుతో 'ఆపరేషన్ కాశ్మీర్' ను విజయవంతంగా పూర్తి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇప్పుడు దేశ అంతర్గత భద్రత వ్యవహారాలపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలలో నక్సలైట్లను అరికట్టే దిశగా ఆయా రాష్ట్రాలు ఎలాంటి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయనే దానిపైన అమిత్ షా అధ్యక్షతన సోమవారం రోజున ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, ఛత్తీస్ ఘర్ సీఎం భూపేష్ బాఘెల్ సహా ఇతర నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు ఇతర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు హాజరయ్యారు.
కాగా, సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు, తనకు బదులుగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని పంపించారు. మరోవైపు కొంతకాలంగా బీజేపీతో పోరు తీవ్రతరం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాను రాకుండా తమ రాష్ట్ర డీజీపీని పంపించింది. ఇక మరో సీఎం మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు.
అమిత్ షా కీలక భేటీకి గల కారణాలు...
ఛత్తీస్ ఘర్, ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ. ఈ పది రాష్ట్రాలను నక్సల్స్ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
హోంశాఖ లెక్కల ప్రకారం 2009-13 మధ్యకాలంలో ఈ 10 రాష్ట్రాల నుంచి మొత్తంగా నక్సల్స్ హింసాత్మక ఘటనలకు సంబంధించి 8,782 కేసులు నమోదయ్యాయి. అదే 2014-18 మధ్య కాలంలో కేసుల సంఖ్య 4,969కు తగ్గింది. అంటే 43.4 శాతం పురోగతి కనిపించింది.
నక్సల్స్ దాడులలో 2009-13 కాలంలో పోలీసులు, భద్రత సిబ్బంది మరియు పౌరులతో కలిపి 3,326 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-18 కాలంలో ఈ సంఖ్య 1,321 కు తగ్గింది. ఈ మొత్తం కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో సుమారు 1400 మంది నక్సల్స్ హతమయ్యారు.
కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 310 నక్సల్స్ దాడుల ఘటనలు నమోదయ్యాయి, 88 మంది పౌరులు చనిపోయినట్లు హోంశాఖ లెక్కలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. గత నెలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా ఇదే అంశంపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సుస్థిరమైన విధానాల వల్ల 'వామ పక్ష తీవ్రవాదం ' (LWE - Left Wing Extremism) తగ్గుకుంటూ పోతుందని ఆయన వెల్లడించారు.
తాజా అమిత్ షా సమావేశాన్ని బట్టి ఇకపై నక్సల్స్ ఏరివేతపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. నక్సల్స్ ను సమూలంగా నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. ఏడాదికి రూ.1000 కోట్లు చొప్పున ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దీనిని బట్టి ఇక ముందు నక్సల్స్ ప్రాభావిత రాష్ట్రాల్లోని అడవులలో నక్సల్స్ ఏరివేత చర్యలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.