Dr Syama Prasad Mookerjee Port: కోలకతా పోర్టు ఇకపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు, పేరు మార్చిన ప్రధాని, పౌరసత్వంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, అది ఇచ్చేదే కాని రద్దు చేసేది కాదు, కోల్‌కతాలో ప్రధాని స్పీచ్ హైలెట్స్..
PM Modi at event marking Kolkata Port Trust's 150th anniversary | (Photo Credits: ANI)

Kolkata, January 12: పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో(West Bengal) ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కత నౌకాశ్రయానికి (Kolkata Port) భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ(Syama Prasad Mookerjee Port) పేరు పెడుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్‌కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఆలోచనకు అంకురార్పణ చేసిన గొప్ప నాయకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ అని ప్రధాని కొనియాడారు. సత్యాగ్రహం నుంచి స్వచ్చాగ్రహం (స్వచ్ఛ భారత్) వరకు ఎన్నో అనుభూతులకు కోల్‌కత పోర్టు వేదికైందని గుర్తు చేశారు.

చంపుకోవడం, కొట్టుకోవడం భారతదేశ చరిత్ర కాదు, కలకత్తా పర్యటనలో ప్రధాని మోడీ

ఎందరో వ్యాపారస్తులు, గొప్ప గొప్ప నాయకులు పోర్టు సేవలను పొందారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరవడం గమనార్హం. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాందవియా తదితరులు హాజరయ్యారు.

Update By ANI

దీంతో పాటుగా దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై(CAA) ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఏఏపై నెలకొన్న భయాలను, సందేహాలను నివృత్తి చేసే యత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

ఏ ఒక్కరు కూడా పౌరసత్వ హక్కుని కోల్పోరని తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం.. పౌరసత్వం ఇచ్చేది... రద్దు చేసేది కాదని అన్నారు. CAAపై లేని పోని అపోహలు వద్దన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు.

Update By ANI

వేధింపులకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశమని ప్రధాని అన్నారు. మన చుట్టూ ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, అలాంటి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో యువత విసిగి వేసారి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటికి వాస్తవ సమాచారంతో జవాడు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పౌరసత్వ చట్టం ఒక్క రాత్రిలో తీసుకొచ్చింది కాదనే విషయం ఈశాన్య ప్రాంతాల ప్రజలు, బెంగాల్ ప్రజలు గ్రహించాలని ప్రధాని కోరారు.

Update By ANI

వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వారెవరైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే వారు దేశ పౌరులే అవుతారనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సీఏఏ అనేది దానికి సవరణ మాత్రమే. ఇతర దేశాల్లో కష్టాలు పడుతున్న వారికి పౌరసత్వం కల్పించేందుకు మార్గం సుగమం చేస్తూ సీఏఏలో మార్పులు చేశాం' అని ప్రధాని మోడీ వివరించారు.

సీఏఏ ద్వారా మైనారిటీలకు బాసటగా నిలవాలన్న మహాత్మాగాంధీ ఆశయాలను, కలలను తమ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. పాకిస్తాన్, ఇతర దేశాల్లో చిత్రహింసలకు గురైన ప్రజలకు భారత్ లో మానవతా దృక్పథంతో పౌరసత్వం కల్పించాలని మహాత్మాగాంధీతో పాటు ప్రభుత్వంలోని పలువురు పదేపదే చెబుతూ వచ్చారని మోడీ గుర్తు చేశారు.

పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం పలుమార్లు వివరణ ఇచ్చినా స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో విపక్షాలు ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న వేధింపులు ఇప్పుడు ప్రపంచానికి తెలిశాయని, 50 ఏళ్లుగా తమ దేశంలో మైనారిటీలను ఎందుకు వేధిస్తున్నదో పాకిస్తాన్‌ ప్రపంచానికి తెలియచేయాల్సి ఉందని నిలదీశారు.

ఈ చట్టం ఈశాన్య ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కల్పించదని ప్రధాని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద జయంతోత్సవాల సందర్భంగా రామకృష్ణ మఠానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.