 
                                                                 New Delhi, NOV 08: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) పదవీ విరమణ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు ఆఖరి పనిదినం కావడంతో సుప్రీంకోర్టు (Supreme court) బార్ అసోసియేషన్ వీడ్కోలు సభ నిర్వహించింది. ఈ సందర్భంగా తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరాయంగా చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ఒక శూన్యత ఆవరిస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు.
‘‘న్యాయం అనే పెద్ద అరణ్యంలో ఒక ఎత్తైన వృక్షం వెనక్కి అడుగు వేస్తే.. పక్షులు తమ కిలకిలరావాలను ఆపేస్తాయి. గాలి దిశ మారుతుంది. మిగతా చెట్లు మారుతూ.. ఆ శూన్యతను భర్తీ చేస్తాయి. కానీ, ఆ అరణ్యం మాత్రం మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉండదు. సోమవారం నుంచి మేం మార్పును ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ న్యాయస్థానం స్తంభాల ద్వారా శూన్యత ప్రతిధ్వనిస్తుంది. బార్ అసోసియేషన్ సభ్యులు, బెంచ్ సభ్యుల గుండెల్లో నిశ్శబ్దత నెలకొంటుంది’’ అని వ్యాఖ్యానించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ.. ఆయన ఓ స్కాలర్, ధర్మశాస్త్ర పండితుడు అన్నారు. అనేక గొప్ప తీర్పులను ఇస్తూ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ప్రశాంతతను పొందారంటూ ఆయనలోని సుగుణాలను ప్రశంసించారు.
శుక్రవారం ఇచ్చిన రెండు తీర్పులతో పాటు 38 రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఇచ్చారని.. ఇది ఎవరూ అంత తేలిగ్గా బ్రేక్ చేయలేని రికార్డు అన్నారు. వైవిధ్యమైన అంశాలపై ప్రసంగించడంలో ఆయన సామర్థ్యాన్ని అనుకరించడం కష్టతరమైన మరో ఘనత అని పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రసంగాలను అనర్గళంగా చేయగలిగే విలక్షణమైన వక్త అన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
