New Delhi, July 31: వయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం..164 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు
కాగా భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు (Landslides) విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు (Kerala Given Early Warning) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. శవాల దిబ్బగా మారిన దేవుని సొంత దేశం, వయనాడ్ విలయంలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కానరాని 98 మంది జాడ
‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రాకతో పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమై ఉండి ఉంటే.. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ సందర్భంగా అమిత్ షా పార్లమెంట్‌కు తెలిపారు.