Lok Sabha Elections 2024 Phase 3 Polling: మూడోద‌శ ఎన్నిక‌ల్లో మోస్త‌రు పోలింగ్ న‌మోదు,  64.4 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న‌, అస్సాంలో మాత్రం ఏకంగా 81 శాతానికి పైగా న‌మోదు
Polling (Photo-ANI)

New Delhi, May 08: కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ (Polling) ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, యూటీల్లోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 65 ఓటింగ్‌ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా అస్సాంలో అత్యధికంగా 81.71, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్‌ నమోదైందని పేర్కొన్నది. బీహార్‌, గుజరాత్‌లోనూ దాదాపు 58 శాతం, మహారాష్ట్రలో 61 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటేశారని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు గుజరాత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ముర్షీదాబాద్‌, జంగిపూర్‌ నియోజకవర్గాల్లో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్‌-సీపీఎం కూటమి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ముర్షీదాబాద్‌ నియోజకవర్గంలో అధికార టీఎంసీ భయోత్పాతం సృష్టించిందని సీపీఎం అభ్యర్థి మహ్మద్‌ సలీం అన్నారు.

 

యూపీలో ఎన్నికల అక్రమాలు జరిగాయని, కొన్ని చోట్ల రిగ్గింగ్‌ జరిగిందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. మెన్‌పురిలోపోలింగ్‌ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్లను పోలీసుస్టేషన్లో నిర్బంధించారని పేర్కొన్నారు.