INX మీడియా స్కాం కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (Palaniappan Chidambaram) కోసం సీబీఐ, ఈడీ గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం లాయర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా, కోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఇది అతిపెద్ద ఆర్థిక నేరమని బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి వచ్చారు. ఇప్పటికే ఈడీ ఆయన కోసం లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఆయన మాత్రం ఎవరికి చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్నారు.
హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంలో లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఢిల్లీలో హైకోర్ట్ తీర్పును దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ రమణ చిదంబరం లీవ్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ వద్దకు పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దీంతో మాజీ కేంద్రమంత్రికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఇప్పుడు చిదంబరం భవితవ్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆయన కూడా ఢిల్లీ హైకోర్ట్ తీర్పుతో ఏకీభవిస్తే చిదంబరం జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈలోపు సీబీఐ, ఈడీ ఎవరికి చిక్కినా కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోలేరు.
గతంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం ఆనాడు ఎవరితో అయితే సెల్యూట్స్ కొట్టించుకున్నారో, నేడు అదే సీబీఐ, అదే ఈడీల అధికారులకు దొరకకుండా వారి నుంచి తప్పించుకు తిరగడం పట్ల ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. మరికొంత మంది 'కర్మ' అని కూడా చెప్తున్నారు. గతంలో అమిత్ షాను చిదంబర జైలుకు పంపించారు. నేడు అదే అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయి కూర్చున్నారు. ఇప్పుడు ఎందుకు వదిలిపెడతారు. అంటూ సెటైర్లు వేస్తున్నారు.
'పవర్' ఎంత పవర్‌ఫుల్లో ఇప్పుడు చిదంబరంకే కాదు, దేశంలో చాలా మందికి అర్థమవుతుంది. తాము పవర్‌లో ఉన్నప్పుడు ఉపయోగించిన అధికారం ఇప్పుడు వారినే వెంటాడుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే పరిస్థితి.
ఇవన్నీ ప్రతిపక్షాలను అణిచివేయడానికి అధికార పక్షం చేస్తున్న కక్ష పూరిత చర్యలే అని దేశంలోని చాలా మంది రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నా, వారి హయాంలో వారంతా కూడా ఎన్నో స్కాంలు, ఎన్నో దురాగతాలు చేశారని ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న వారే.
ప్రస్తుతం చిదంబరంపై వేలాడుతున్న INX మీడియా స్కాం కేసు కేవలం రూ. 305 కోట్లకు సంబంధించినది. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నకాలంలో 2007 లో రూ .305 కోట్ల విదేశీ నగదును స్వీకరించి ఆ మీడియా గ్రూపుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్ ఇప్పించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ ఆయనపై 2018 లో మనీలాండరింగ్ నమోదు చేయబడింది.