Mumbai, DEC 04: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవి చేపట్టేందుకు ఆ రాష్ట్ర కేర్ టేకర్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకారం తెలిపారు. షిండేను (Eknath Shinde) ఒప్పించేందుకు ఫడ్నవీస్ ఆయన ఇంటికి వెళ్లి జరిపిన చర్చలు ఫలించాయి. ఫడ్నవీస్ విజ్ఞప్తితో డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు షిండే ఒకే చెప్పారు. కాగా అంతకుముందు ప్రెస్‌మీట్‌లో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ (Ajit Pawar) మధ్య జరిగిన సంభాషణ కలకలం రేపింది. ‘మీరు, అజిత్ పవార్ రేపు డిప్యూటీ సీఎంలుగా (Deputy CM Oath) ప్రమాణస్వీకారం చేస్తున్నారా..’ అన్న మీడియా ప్రశ్నకు దీనిపై సమాధానానికి సాయంత్రం వరకు వేచి చూడాలని షిండే చెప్పారు. ఈ సమయంలో అజిత్ పవార్ స్పందిస్తూ తానైతే ప్రమాణస్వీకారం చేస్తానని అన్నారు. షిండేకు విషయం బోధపడటానికి సాయంత్రం వరకు సమయం పడుతుందని చమత్కరించారు.
Eknath Shinde To Take Oath As Maharashtra’s Deputy CM
Eknath Shinde to take oath tomorrow as Maharashtra's Deputy CM along with Ajit Pawar, in the new government: Shiv Sena Sources pic.twitter.com/P9OsbJZMjm
— ANI (@ANI) December 4, 2024
దాంతో షిండే.. అజిత్ పవార్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అజిత్ పవార్‌లా ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట తాను మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు నవ్వుకుంటూనే ఈ సంభాషణ కొనసాగించారు. అయితే ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవి చేపడుతానని స్పష్టంగా చెప్పకపోవడంతో కూటమిలో లుకలుకలు ఉన్నాయని ప్రచారం జరిగింది.
దాంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ప్రెస్ మీట్ అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్‌నాథ్ షిండే ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. బెట్టు చేయకుండా డిప్యూటీ సీఎం పదవి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఫడ్నవీస్ విజ్ఞప్తితో డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు షిండే అంగీకరించారు.