New Delhi, FEB 11: భూమి 2023లో రికార్డు స్థాయిలో వేడెక్కింది. ఎన్నడూ లేనివిధంగా భూతాపం (Global Warming) పెరిగింది. గత లక్ష సంవత్సరాల్లోనే 2023లో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. ఎల్ నినో (El Nino), వాతావరణ మార్పుల కారణంగా తుఫానులు, కరువు కాటకాలు, కార్చిచ్చు తదితర కారణాలతో భారీగా భూమి వేడెక్కింది. అయితే, ప్రస్తుతం ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనపడే (El Nino) అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో రాబోయే రుతుపవనాల సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆదివారం తెలిపింది. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఎల్ నినో బలహీనపడడం (El Nino Is Weakening) ప్రారంభమైందని గతవారం రెండు వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి.
ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నది. భారత వాతావరణ శాస్త్రవేత్తలు సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. జూన్-ఆగస్టు నుంచి లా నినా పరిస్థితులు ఏర్పడడం వల్ల గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాలు బాగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్-జూలై నాటికి లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం మెండుగా ఉన్నాయని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో, ఈఎన్‌ఎస్‌ఓ (ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్) తటస్థంగా మారినప్పటికీ.. గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.
భారతదేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70శాతం నైరుతి రుతుపవనాలదే. వ్యవసాయ రంగానికి రుతుపవనాలే కీలకం. దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో వ్యవసాయ రంగం వాటా 14శాతం ఉన్నది. 1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో సగం కంటే ఎక్కువ జనాభాకు వ్యవసాయమే జీవనోపాధిని అందిస్తున్నది. ఏప్రిల్-జూన్ నాటికి ఎల్ నినో.. ఈఎన్‌ఎస్‌ఓ-తటస్థంగా మారే అవకాశం 79శాతం ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఇటీవల తెలిపింది.
జూన్-ఆగస్టు నాటికి లా నినా అభివృద్ధి చెందడానికి 55శాతం అవకాశం ఉందని చెప్పింది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ సైతం ఎల్ నినో బలహీనపడుతున్నట్లుగా పేర్కొంది. భారత వాతావరణ విభాగం (IMD) సీనియర్ శాస్త్రవేత్త డీ శివానంద్ పాయ్ మాట్లాడుతూ తాము ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. కొన్ని పరిస్థితులు లా నినాను సూచిస్తున్నాయని వివరించారు.