New Delhi, June 28: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్‌లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ (EPFO Key Decision) జారీ చేసింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యథావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. కాబట్టి 2013 సెప్టెంబర్ 1 తర్వాత జాబ్‌లో చేరిన ఆయా కేటగిరిలో ఉన్న ఉద్యోగులు వచ్చే నెల నుంచి ఎక్కువ వేతనం పొందనున్నారు.
2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఇప్పటివరకు డిడక్షన్ అయిన మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. జీఐఎస్ పరిధి నుంచి వీరిని శాశ్వతంగా తొలగించనున్నారు. జీఐఎస్ కింద తగ్గింపులు నిలిపివేయడంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు కూడా పెరగనున్నాయి.
గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది 1982 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారు ప్రమాదాలకు గురైనప్పుడు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశంగా దీన్ని తీసుకొచ్చారు.