PM Modi on Farmers' Protest: రైతులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించాయి, దిల్లీ కేంద్రంగా భారీ కుట్ర జరిగింది, రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
PM Modi at an official event in Kutch | (Photo Credits: ANI)

New Delhi, December 15:  దేశ రాజధాని దిల్లీ సరిహద్దు వెంబడి వేలాదిగా తరలివస్తూ ఆందోళనలో చేపడుతున్న రైతుల ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పెదవి విప్పారు. రైతులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించాయని ఆయన ఆరోపించారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల సంక్షేమం కోసమేనని మోదీ పునరుద్ఘాటించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను గందరగోళపరిచేందుకు దిల్లీలో భారీ కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారి భయాలను ఒక ఉదాహరణతో తొలగిస్తామని పేర్కొన్నారు.

గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, కచ్‌లో పలు కీలక ప్రాజెక్టులకు పునాది వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల సంక్షేమం కోసమే. గతంలో పలు రైతు సంఘాలు వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలను కోరాయి. ప్రతిపక్షాలు కూడా కొన్ని సంవత్సరాలుగా వాటిని డిమాండ్ చేశాయి.  ప్రతిపక్షంలో ఉన్నవారు తమ పాలనలో వ్యవసాయంలో సంస్కరణలు తీసుకురావడంలో విఫలమయ్యారు,  ఇప్పుడు తమ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేస్తే,  రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు." అని మోదీ అన్నారు.

గుజరాత్ కచ్‌లో డీశాలినేషన్ ప్లాంట్ ,  పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ ప్లాంట్‌కు పునాది రాయి వేసిన తరువాత ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పప్పులు, ధాన్యాలను ఉత్పత్తి చేసే చిన్న రైతులకు పంటలను విక్రయించే స్వేచ్ఛ ఎందుకు లభించకూడదని దేశం అడుగుతోంది. దేశంలో  వ్యవసాయ సంస్కరణలకు కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది.  రైతులు తాము పండించే ధాన్యాలను ఎక్కడైనా  విక్రయించే అవకాశం కల్పించాలని చాలా మంది రైతులు, రైతు సంఘాలు

ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి.  ఆ సమస్యను పరిష్కరించటానికే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని తమ ప్రభుత్వ నిర్ణయాని  ప్రధాని మోదీ సమర్థించుకున్నారు.

ఇదిలా ఉంటే,  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. దేశ రాజధాని దిల్లీకి ఆనుకొని మరియు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో రైతు సంఘాలను తమ ఆందోళనలను తీవ్రతరం చేశాయి. మరోవైపు ఇప్పటికే కొవిడ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుందని భారతీయ వాణిజ్య సంఘం అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల ఆందోళన వల్ల రోజుకు రూ. 3500 కోట్ల నష్టం వాటిళ్లుతుందని, ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించింది.