Jammu and Kashmir: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల తరహాలో ఉద్యమిస్తేనే, కశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరించుకోగలం, ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..
NC president Farooq Abdullah (ANI)

శ్రీనగర్, డిసెంబర్ 5: ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజలు రైతులలాగే పోరాడాల్సిన అవసరం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యపై వివాదం చెలరేగింది. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు కోసం జమ్ముకశ్మీర్‌ ప్రజలు రైతుల్లా పోరాటం చేయాలని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలలకు పైగా పోరాటం చేశారని తెలిపారు. వారి పోరాటంలో 700 మందికి పైగా రైతులు మృతి చెందారని అన్నారు. రైతుల బలిదానాలతో కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని తెలిపారు.

కశ్మీరీలు తమ హక్కులు తిరిగి పొందాలంటే రైతుల్లా త్యాగాలు చేయాలని అన్నారు. తాము ఆర్టికల్ 370, 35 ఏ, రాష్ట్ర హోదాను తిరిగి పొందుతామని వాగ్దానం చేశామని గుర్తుచేశారు. దాని కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తమ పార్టీ హింసకు మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 5 ఆగస్టు, 2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.