What The Fart: గుజరాత్‌లో 'బాంబు'ల మోత. తట్టుకోలేని వాయుకాలుష్యం. విఫలమైన వింత పోటీ, ఇదేం పోటీరా బాబు అని సిగ్గులమొగ్గ అయిన పోటీదారులు
Fart. Representational Image. (Photo Credits: Pixabay)

Surat, September 23: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఒక విచిత్రమైన పోటీని నిర్వహించారు. భారత దేశంలో ఇలాంటి పోటీ ఇంతవరకు ఎవరూ నిర్వహించలేదు. తామే మొట్టమొదటిసారిగా ఇలాంటి పోటీని నిర్వాహిస్తున్నామని నిర్వాహకులు ఎంతో గొప్పగా చాటుకున్నారు. ఇంతకీ ఈ పోటీ ఏంటో తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే. ఈ పోటీ పేరు WTF (What The Fart). అందరికీ అర్థమయ్యే రీతిలో, వాడుక భాషలో సింపుల్‌గా చెప్పాలంటే 'పిత్తుల పోటీ' (అవపాన వాయువు విడుచుట పోటీ)! అవాక్కయ్యారా?  మళ్ళీ ఈ పోటీలో పాల్గొనేందుకు సూరత్, జైపూర్, ముంబై నగరాల నుంచే కాకుండా దుబాయ్ నుంచి కూడా మొత్తం 200 మంది స్త్రీ-పురుషులు రిజిస్టర్ చేసుకున్నారు.  అయితే 70 మంది మాత్రమే ఈ పోటీకి హాజరయ్యారు. సూరత్ లోని ఒక ఆడిటోరియం ఈ పోటీకి వేదికైంది. ఈ ఈవెంట్‌కి జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు. నిన్న ఆదివారం రోజు ఈ పోటీని ప్రారంభిస్తూ నిర్వాహకులు చెప్పిన మాట "మనస్పూర్థిగా పిత్తండి" (Fart from the heart).

ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఈ పోటీలో 3 కేటగిరీల్లో విజేతలను నిర్ణయించడం. అవేంటంటే, దీర్ఘమైన వాయువు విడవటం ( the longest fart), బిగ్గరైన వాయువు విడవటం (the loudest fart) మరియు మనోహరమైన వాయువు విడవటం (the most musical fart). అంతేకాదు ఎవరి వాయువు తీవ్రత ఎంతుందో కొలవడానికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు.

What The Fart Competition:

ఇంతకీ ఈ వింత ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది  యతిన్ సంగొయ్ అనే ముంబైకి చెందిన 48 ఏళ్ల సింగర్. యతిన్ ఒక టీవీలో ఏదో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అందులో వచ్చిన Fart Competition తనకు ఎంతగానో నచ్చిందట. అది చూసి అతడు చాలా సేపు నవ్వుకున్నాడట. అయితే అలాంటి కార్యక్రమం మనమూ ఎందుకు నిర్వహించకూడదు? అనే ఆలోచన వచ్చి, అనుకున్నదే తడవుగా భారీస్థాయిలో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశాడు. చాలా మంది 'వాయువు వదలడం' సిగ్గుగా భావిస్తారు. అది కూడా ఆరోగ్యకరమైన చర్యే అని చాటిచెప్పడం కోసం ఈ ఈవెంట్ ప్లాన్ చేశానని అతడు చెప్పుకొచ్చాడు.

అయితే భారీస్థాయిలో పబ్లిసిటీ చేసిన ఈ ఈవెంట్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ఈవెంట్‌కు వచ్చిన చాలా మంది స్టేజ్ మీదకు వెళ్లి తమ "ప్రదర్శన" చేయడానికి సిగ్గుగా, అసౌకర్యంగా ఫీలయ్యారు. ఒకరిద్దరూ  తమ "సత్తా" బాగానే చాటినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేదు. దీంతో విజేతల కోసం నిర్ణయించిన 3 ట్రోఫీలు ఎవరూ గెలుచుకోలేకపోయారు. అయితే ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ రూ. 2500 నగదుతో పాటు సెంటు బాటిళ్లు బహుమతిగా అందజేశారు.  అయితే బహుమతులు పొందిన వారు ఎలాంటి  సంతోషాన్ని వ్యక్తం చేయలేదు.

ఈ పోటీలో పాల్గొని తప్పుగా ఫీలవుతున్నామని కొంతమంది చెప్పడం గమనార్హం.

ఇక సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ఇలాంటి ప్రయోజనం లేని కార్యక్రమాలు నిర్వహించే వారుండటం, అలాంటి దిక్కుమాలిన కార్యక్రమాల్లో సైతం పాల్గొనే జనాలుండటం చూస్తే దేశంలో ఆర్థిక సంక్షోభాలు రావడం సహజమే అని విమర్శిస్తున్నారు.