Chattisgarh Shocker : అంబులెన్స్ లేక  భుజంపై కూతురి శవం మోసుకుంటూ 10 కిలో మీటర్లు నడిచిన తండ్రి, దారుణం...
(Image: ANI)

రాయ్ పూర్, మార్చి 26; ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన.. మన దేశంలో ఉన్న దయనీయ స్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో కూతురు చనిపోతే.. ఆ శవాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వకపోవడంతో.. చివరకు తానే కూతురు శవాన్ని భుజాలపై మోస్తూ.. 10 కి.మీ. నడిచి ఇంటికి తీసుకెళ్లాడు ఆమె తండ్రి. గుండెల నిండా దు:ఖంతో ఆ తండ్రి పడుతున్న కష్టాలు అందరినీ కలిచివేస్తోంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా లఖన్‌పూర్ మండలం ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వదాస్‌కు ఏడేళ్ల కూతురు ఉంది. ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురయింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు జ్వరం వచ్చింది. జ్వరమే కదా..తగ్గుతుందని అనుకున్నారు. రెండుమూడు రోజులైనా తగ్గకపోవడంతో.. లఖన్‌పూర్‌లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక కన్నుమూసింది. తన కూతురు మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని.. ఈశ్వర్ దాస్ ఆరోపిస్తున్నాడు. డాక్టర్లు వైద్యం చేయకుండా.. నర్సులు వైద్యం చేస్తున్నారని చెప్పాడు. తన కూతురికి నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిందని.. అందువల్లే ఆమె చనిపోయిందని మీడియాకు చెబుతూ.. కంటతడిపెట్టాడు ఈశ్వర్ దాస్.

ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ ఆ చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వలేదు. ఎంత బతిమాలినా కనుకరించలేదు. పోనీ ప్రైవేట్ వాహనంలో ఇంటికి తీసుకెళ్దామటే.. అంత స్థోమత ఆ తండ్రికి లేదు. దిక్కుతోచని స్థితిలో.. చివరకు తానే భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దాదాపు 10 కి.మీ. నడిచి.. తన కూతురికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత దారుణమా..? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఆరోగ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. పాపను బతికించేందుకు వైద్య సిబ్బంది ఎంతో ప్రయత్నించారని, ఐనప్పటికీ ఆమె మరణించడం బాధాకరమని అన్నారు. డెడ్‌బాడీ గురించి సమాచారం అందిన తర్వాత ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మృతురాలి కుటుంబీకులతో మాట్లాడారని.. కానీ వారు నడుచుకుంటూనే ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మండల వైద్యాధికారిని సస్పెండ్ చేశారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.