Fire Broke at ONGC Plant: ముంబైలోని ఓఎన్‌జిసి ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఘటన స్థలంలోనే పలువురి సజీవ దహనం. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు, వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు.
Massive Fire broke at ONGC Plant (Photo Credits: ANI)

Mumbai, September 3: మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్లాంట్‌లో మంగళవారం రోజున భారీగా మంటలు చెలరేగడంతో కనీసం నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ సంఖ్యపై అధికారులు స్పష్టతను ఇవ్వడం లేదు.  నవీ ముంబైలోని ఉరాన్ ప్రాంతంలోని ఒఎన్‌జిసి యొక్క గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఉదయం సుమారు 6:45 - 7 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆ సమయంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యారు.  ఉదయం పూట భారీ పేలుడుతో, ఎగిసిపడే మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందిన వెంటనే ఉరాన్, పన్వేల్, జెఎన్‌పిటి, ద్రోణగిరి మరియు సీవుడ్స్ ప్రాంతాల నుంచి అగ్నిమాపక దళాలు రంగంలోకి హాయక చర్యలు ప్రారంభించాయి.

దాదాపు 50 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

 

ఒఎన్‌జిసి ఫైర్ సర్వీసెస్ మరియు విపత్తు నిర్వహణ బృందం వెంటనే చర్యలు ప్రారంభించింది. ప్లాంట్ కు 2 కిలో మీటర్ల పరిధినంతా తమ ఆధీనంలోకి తీసుకొని అటువైపు ఎవరిని అనుమతించడం లేదు. ముందు జాగ్రత్త చర్యగా ఉరాన్ ప్లాంట్ నుంచి గ్యాస్ ను గుజరాత్ లోని హజిరా గ్యాస్ ప్లాంట్ కు పంపిణీ చేస్తున్నారు. చమురు శుద్ధి యూనిట్ పై ఎలాంటి ప్రభావం లేదని, పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒఎన్‌జిసి ప్రకటించింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.