Tiruvananthapuram, JAN 19: కేరళకు చెందిన వ్యక్తి రష్యా ఆర్మీలో (Russia Army) చేరాడు. ఉక్రెయిన్ యుద్ధంలో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి మరణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (3 Arrested In Kerala) 32 ఏళ్ల బినిల్, 27 ఏళ్ల జైన్ ఐటిఐ మెకానికల్ డిప్లొమా చదివారు. బంధువులైన వారిద్దరూ ఎలక్ట్రీషియన్, ప్లంబర్లుగా పని చేసేందుకు గత ఏడాది ఏప్రిల్ 4న రష్యా వెళ్లారు. అయితే వారి పాస్‌పోర్ట్‌లను రష్యా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో (Russian Military) భాగంగా ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వారిని పంపారు. జనవరి 13న వార్‌లో బినిల్ మరణించగా, జైన్ తీవ్రంగా గాయపడ్డాడు. మాస్కోలోని ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.
కాగా, అధిక జీతం ఇచ్చే ఉద్యోగాల పేరుతో బినిల్, జైన్‌ను కొందరు ఏజెంట్లు అక్రమంగా రష్యా పంపినట్లు మృతుడి భార్య, గాయపడిన వ్యక్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో త్రిసూర్‌కు చెందిన సందీప్ థామస్, సుమేష్ ఆంటోనీ, సీబీలను పోలీసులు విచారించారు. బినిల్, జైన్ రష్యాకు వెళ్లడం వెనుక వారి ప్రమేయం ఉందని తేల్చారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇమిగ్రేషన్ చట్టం, మానవ అక్రమ రవాణా, మోసం కింద వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.